తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు.
పాల్వంచ గ్రామీణం, : తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి పోలీసులకు చిక్కారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది. గ్రామీణం ఎస్సై బి. శ్రీనివాస్ వివరాల ప్రకారం.. చిరుతానుపాడుకి చెందిన పద్దం ఉంగయ్య(20) సమీప కొత్తూరు గొత్తికోయ గుంపునకు చెందిన మడవి ఉంగీని నెలరోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇది ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు రెండ్రోజుల తర్వాత చిరుతానుపాడులో పంచాయితీ పెట్టించారు. పిన్ని వరసయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంటూ పెద్ద మనుషులు ఉంగయ్యకు రూ.1.50 లక్షల జరిమానా విధించారు. ఉంగయ్య అదే రోజు రూ.1.20 లక్షలు చెల్లించి భార్యను ఇంటికి తీసుకెళ్లారు. మిగతా రూ.30 వేలు ఇవ్వాలంటూ ఏప్రిల్ 26న యువతి పెదనాన్న కుమారులు ఇడమయ్య, అడమయ్య, ఒక బాలుడు(16) ఉంగయ్య ఇంటికొచ్చారు. తన వద్ద డబ్బుల్లేవని చెప్పడంతో చెల్లెల్ని ద్విచక్రవాహనంపై తమ ఊరికి తీసుకెళ్లారు. పుట్టింటికి చేరుకున్న రోజు రాత్రే ఉంగీ కనిపించకుండా పోయారు. ఆమెను వెతుక్కుంటూ బయల్దేరిన సోదరులకు చిరుతానుపాడు సమీపంలో ఉంగయ్య తారసడ్డారు. తమ చెల్లెలు ఎక్కడని ఆయనతో వారు గొడవపడ్డారు. క్షణికావేశంలో కండువాను మెడకు బిగించి హత్యచేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని సమీప గుట్టపై చెట్టుకు వేలాడదీశారు. మృతుడి కుటుంబసభ్యులు ఉంగయ్య అదృశ్యంపై గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు గాలించగా ఊరి సమీపంలోని చెట్టుకు శవం వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై అనుమానం వచ్చి యువతి సోదరుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితుల్లో ఒకడైన అడమయ్య పరారీలో ఉన్నాడు.
Also read
- నేటి జాతకమలు..18 ఫిబ్రవరి, 2026
- పవిత్ర ఫాల్గుణ మాసం.. ఎలాంటి పూజలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయో తెలుసుకోండి
- ఫాల్గుణం.. విష్ణు పూజలకు ప్రత్యేకం.. ఈ మాసంలో వచ్చే పండగలు ఇవే
- అయ్యో దేవుడా.. గుండెల్ని పిండేస్తున్న ఏలూరు విషాదం.. ఊహించని ప్రమాదంతో..
- Viral: అక్కా.! నీకో దండం.. భర్తను అమ్మేసిన భార్య.. కారణం తెలిస్తే బిత్తరపోతారు





