SGSTV NEWS online
Andhra PradeshCrime

ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..







అనంతపురం, అక్టోబర్ 4: అర్ధరాత్రి వేళ ఇళ్లపై రాళ్లు పడుతుండటంతో ఓ గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడి నుంచి రాళ్లు వస్తున్నాయో తెలియక.. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక రాత్రంతా మేలుకుని పహారా కాస్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం అప్పాజీపేటలో చోటుచేసుకున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా రాత్రివేళ గ్రామంలోని పలు ఇళ్లపై అకస్మాత్తుగా రాళ్లు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాళ్లు పడటంతో ఇళ్ల రేకులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించేందుకు గ్రామస్తులు రాత్రంతా మేలుకుని పహారా కాసినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా గ్రామంలో పహారా కాస్తున్నప్పటికీ రాళ్లు పడటం ఆగకపోవడంతో అసలు కారణాన్ని గుర్తించడం సవాలుగా మారింది. పోలీసులు ఉన్న సమయంలోనూ రాళ్లు పడటంతో గ్రామస్తుల్లో మరింత ఆందోళన నెలకొంది. కొంతమంది స్థానికులు దీనిని అదృశ్య శక్తులు, దయ్యాలకు సంబంధించిన ఘటనగా అనుమానిస్తూ భయపడుతున్నారు. అయితే ఇలాంటి అనుమానాలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఘటన వెనుక ఆకతాయిల ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.


పోలీసుల నిఘా ఉన్న సమయంలో రాళ్లు పడుతున్న నేపథ్యంలో.. ఎవరు, ఎక్కడి నుంచి రాళ్లు విసురుతున్నారనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాత్రివేళల్లో ఆకతాయిలు కావాలనే రాళ్లు విసురుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారా? లేక మరేదైనా కారణముందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. రాళ్ల దాడితో ఇళ్లకు నష్టం వాటిల్లడంతో పాటు ప్రజలు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి, తమకు భద్రత కల్పించాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు. అసలు ఈ రాళ్ల వర్షం వెనుక ఎవరు ఉన్నారనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Also read

Related posts