SGSTV NEWS online
CrimeTelangana

వరుస మరణాలతో వణికిపోతున్న గ్రామం.. కీడు పోవాలంటూ ఊరంతా ఏం చేశారో తెలుసా!




పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లి గ్రామంలో వరుస మరణాలు గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. గత రెండు నెలల వ్యవధిలో వివిధ కారణాలతో దాదాపు 15 మంది మృతి చెందడంతో గ్రామంలో ఏదో అపశకునం జరుగుతోందనే భావన ప్రజల్లో బలపడింది. ఒకరి దశదిన కర్మ పూర్తికాకముందే మరో మరణం చోటుచేసుకోవడం, అదే సమయంలో వర్షాలు కూడా కురవకపోవడంతో గ్రామస్తులు మరింత ఆందోళన చెందుతున్నారు.


ఈ నేపథ్యంలో గ్రామ పూజారి సూచన మేరకు గ్రామస్థులు ప్రత్యేకంగా వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఇళ్లకు తాళాలు వేసి, గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేసి పొలిమేరల వైపు వెళ్లిపోయారు. గ్రామంలో ఎక్కడా పొయ్యి వెలిగించకుండా, దుకాణాలు కూడా మూసివేసి, ఊరంతా ఒకేచోట చేరి వంటలు చేసుకుని వనభోజనాలు నిర్వహించారు.

స్థానికుల నమ్మకం ప్రకారం, గ్రామానికి ఏదో కీడు లేదా పీడ పట్టిందని, ఇలా గ్రామాన్ని తాత్కాలికంగా ఖాళీ చేసి ప్రత్యేక పూజలు, వనభోజనాలు నిర్వహిస్తే ఆ దోషం తొలగిపోతుందని భావిస్తున్నారు. సూర్యాస్తమయం అయిన తర్వాతే తిరిగి గ్రామంలోకి అడుగుపెట్టారు. ఇలా చేయడం వల్ల వరుస మరణాలు ఆగిపోతాయని, గ్రామానికి శాంతి చేకూరుతుందని వారు విశ్వసిస్తున్నారు.


అయితే ఆధునిక సాంకేతిక యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను ప్రజలు విశ్వసించడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో జరిగిన మరణాలకు గల అసలు కారణాలను వైద్యపరంగా, సామాజికంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.

గ్రామ ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు అధికారులు స్పందించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Also read

Related posts