ఉరేసుకొని తండ్రి ఆత్మహత్య ప్రకాశం జిల్లా కేవీ అగ్రహారంలో విషాదం
చీమకుర్తి, : ముగ్గురు అక్కాచెల్లెళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. వారి తండ్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కె.వి. అగ్రహారంలో కలకలం రేపింది. ఈ విషాద ఘటనలో ఏకుల సుధాకర్(35), అతని ముగ్గురు కుమార్తెలు గోఅచ్యుత(13), పూజ(10), లోహితశ్రీ(9)లు విగత జీవులుగా మారారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుధాకర్ ఓ గ్రానైట్ క్వారీలో టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన భార్య వెంకటేశ్వరమ్మ మూడు సంవత్సరాలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ముగ్గురు కుమార్తెలు, తల్లి సుశీలతో కలిసి సుధాకర్ కేవీ అగ్రహారంలో జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి పిల్లలకు అన్నం పెట్టిన తర్వాత సుధాకర్ తల్లి సుశీల నిద్రించేందుకు సమీపంలో ఉన్న పశువుల కొట్టానికి వెళ్లింది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో సుశీల పశువుల కొట్టం వద్ద నుంచి ఇంటికి వచ్చి చూడగా.. పిల్లలు ముగ్గురూ పడుకొన్న మంచం వద్దే సుధాకర్ కూర్చొని ఉన్నాడు. పిల్లలు నిద్ర పోతున్నారని, అప్పుడే లేపొద్దని, తాను చీమకుర్తికి వెళ్లి టిఫిన్ తీసుకుని వస్తానని తల్లితో చెప్పి సుధాకర్ బయటకు వెళ్లాడు. పిల్లలు ఎంత సేపటికీ లేవకపోవడంతో నాన్నమ్మ సుశీల వారిని తట్టి లేపేందుకు ప్రయత్నించింది. వారిలో చలనం లేకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచింది. పిల్లలు చనిపోయారని చెప్పేందుకు సుధాకర్కు ఫోను చేయగా.. అతను ఫోను తీయలేదు. ఇంతలో సమీపంలోని పొలంలో సుధాకర్ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ డి.ప్రసాద్, ఎస్సై సంపత్ కుమార్లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మగ్గురు పిల్లలది అనుమానాస్పద మృతిగా, సుధాకరిది ఆత్మహత్యగా కేసులు నమోదు చేశారు. సుధాకర్ తన ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికంగా భావిస్తున్నారు.
Also read
- మునుకుంట్ల ప్రేమికుల మృతి ఘటనలో ట్విస్ట్..!
- గుంటూరులో నడిరోడ్డుపై.. మహిళను వివస్త్రను చేసి దాడి
- నిద్రిస్తున్న కొడుకు తలపై కర్రతో కొట్టి హతమార్చిన తండ్రి
- 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీటీవీ చూసి ఆగ్రహించిన స్థానికుల దాడి, అనుమానితుడు మృతి
- టీ తాగేందుకు రూ.20 ఇవ్వలేదని తలా మొండెం వేరు చేశాడు!





