అమ్మానాన్నలు లేని తనకు అన్నే తండ్రిలా ఉంటాడని ఆ తమ్ముడు భావించాడు. కానీ ఒక చిన్న ఇంటి గొడవ ఆ అన్నలోని మృగాన్ని నిద్రలేపింది.కళ్ల ముందే తిరుగుతున్న తమ్ముడిని కాలయముడిలా మారి కత్తితో పొడిచి చంపాడు. అది కూడా పది మంది పెద్దల ముందు పంచాయతీ జరుగుతుండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
రక్తసంబంధం కంటే ఆస్తి పాస్తి ముఖ్యం అనుకున్నాడో అన్న. పేగు పంచుకుని పుట్టిన తమ్ముడని కూడా చూడకుండా కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఇల్లు విషయంలో మొదలైన గొడవ కాస్తా.. ఒకరి ప్రాణం తీసి, మరొకరిని జైలు పాలు చేసిన విషాద ఘటన తాండూరు పట్టణంలోని మాణిక్‌నగర్‌లో కలకలం రేపింది. మాణిక్‌నగర్‌కు చెందిన మోసీన్, రెహ్మాన్ అన్నాదమ్ములు. తల్లిదండ్రులు లేని ఆ కుటుంబంలో అన్న మోసీన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా.. తమ్ముడు రెహ్మాన్ ఉపాధి కోసం హైదరాబాద్‌లోని బోరబండలో కూలీ పనులు చేస్తున్నాడు. వీరిద్దరికీ ఒక అక్క ఉంది. ఆమె ఆర్థిక సహకారంతో తాండూరులో ఒక ఇల్లు నిర్మించుకున్నారు. అయితే కొంతకాలంగా ఈ ఇంటి యాజమాన్యం విషయంలో అన్నాతమ్ముల మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయి.
పంచాయతీ సాక్షిగా రక్తపాతం
ఆదివారం నాడు ఈ గొడవను సర్దుబాటు చేసేందుకు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగానే, మరోసారి అన్నాదమ్ముల మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరిపై ఒకరు మాటలు విసురుకోవడంతో సహనం కోల్పోయిన పెద్దన్న మోసీన్, తన వద్ద ఉన్న పదునైన కత్తిని తీసి తమ్ముడు రెహ్మాన్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు.
పరారీలో నిందితుడు.. పోలీసుల విచారణ
ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో రెహ్మాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముడిని హతమార్చిన అనంతరం మోసీన్ అక్కడి నుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇల్లు విషయంలో జరిగిన వివాదమే ఈ హత్యకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది అని పోలీసులు తెలిపారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





