తమిళనాడులో సంచలనం సృష్టించిన పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి నిఘా పెట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఈడీ చెన్నై జోనల్ కార్యాలయం బుధవారం తమిళనాడు వ్యాప్తంగా భారీ సోదాలు నిర్వహించింది. చెన్నై, మదురై, తిరుచిరాపల్లి (తిరుచ్చి), కోయంబత్తూరు నగరాల్లోని 21 కీలక ప్రాంతాలపై ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి.
ఈ కేసు 2017లో టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TRB) నిర్వహించిన పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షకు సంబంధించింది. పరీక్ష ముగిసిన తర్వాత OMR షీట్లను స్కాన్ చేసే సమయంలో, నిందితులు డిజిటల్ వ్యవస్థను తారుమారు చేసి, తమకు కావాల్సిన అభ్యర్థుల మార్కులను అక్రమంగా పెంచారనేది ప్రధాన ఆరోపణ.
ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. నిందితులు ఏకంగా 385 నకిలీ సెకండరీ OMR షీట్లను సృష్టించి, మార్కులు కలపడం ద్వారా 262 మంది అనర్హులను లెక్చరర్ పోస్టులకు ఎంపిక చేశారు. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఈ మోసం బయటపడింది. వెంటనే ఆ ఫలితాలను ఉపసంహరించుకుని, జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేశారు. దీనిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి 2021, 2023లలో చార్జిషీట్లు దాఖలు చేయగా, ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
ఒక్కో పోస్టుకు రూ.14 నుంచి 16 లక్షల వసూలు!
ఈడీ దర్యాప్తు ప్రకారం.. ప్రధాన నిందితుడు వి. సుబ్రమణియన్, అతని సహచరుడు సురేష్ పాల్.. ‘మెస్సర్స్ డేటాటెక్ టెక్నికల్’ సంస్థ ఉద్యోగులైన షేక్ దావూద్ నాసిర్, ఐ. రఘుపతిలతో కలిసి ఈ కుట్రకు తెరలేపారు. మధ్యవర్తులు, ఏజెంట్ల నెట్వర్క్ను ఏర్పాటు చేసి, ఉద్యోగాల కోసం ఆశపడ్డ అభ్యర్థుల నుండి రూ.14 లక్షల నుండి రూ.16 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన కోట్ల రూపాయల నల్లధనాన్ని దాచడానికి విజ్డమ్ ఎంటర్ప్రైజెస్, సూరియం ఎంటర్ప్రైజెస్, ట్రస్ట్ ఎంటర్ప్రైజెస్ వంటి బినామీ కంపెనీలను, నకిలీ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారు. ఆ డబ్బును స్థిరాస్తులు, బంగారం, వెండి ఆభరణాలలో పెట్టుబడిగా మార్చారు.
ఆస్తుల జప్తు.. 56 బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్!
ప్రస్తుత దాడుల్లో ఈడీ అధికారులు కీలకమైన డిజిటల్ సాక్ష్యాలు, ఏజెంట్ల వసూళ్ల రికార్డులు, వివిధ ప్రభుత్వ పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ల కార్బన్ కాపీలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.13.18 లక్షల నగదును సీజ్ చేశారు. నిందితులకు చెందిన 56 బ్యాంక్ ఖాతాలు, 2 డీమ్యాట్ ఖాతాలను పూర్తిగా స్తంభింపజేశారు.
నిందితుల పేరిట ఉన్న 36 స్థిరాస్తులకు సంబంధించిన దస్తావేజులను ఈడీ జప్తు చేసింది. ఈ ఆస్తుల ప్రభుత్వ అధికారిక విలువ రూ.9.67 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్ విలువ రూ.20 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అవినీతి నెట్వర్క్కు సంబంధించిన మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని, రానున్న రోజుల్లో మరికొన్ని ఆస్తుల అటాచ్మెంట్తో పాటు అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి.
Also read
- హారతి సమయంలో గంట మోగించని ఏకైక ప్రసిద్ధ దేవాలయం ఇదే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న దివ్య రహస్యం ఇదే!
- Video: ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐస్క్రీమ్ అందుకోబోయాడు.. క్షణాల్లోనే ఎవ్వరూ ఊహించని సీన్.. వీడియో చూడండి..
- Andhra: తరచూ అర్థరాత్రి వేళల్లో పోతున్న కరెంట్.. ఏంటా అని ఆరాతీస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..
- పక్కా స్కెచ్.. ఏటీఎం డబ్బుతో పరారైంది తండ్రీకొడుకులే





