Agastyeswara Temple Proddatur History : పరమేశ్వరుడు వెలసిన ఆలయాలలో ఎక్కువ భాగం అతి ప్రాచీన చరిత్ర కలిగినవే అయి ఉండడం విశేషం. వాస్తవానికి ఈశ్వరుడు వెలసిన ప్రతి క్షేత్రానికి ఓ కథ ఉంటుంది. కొన్ని శివాలయాలు విభిన్నమైన నిర్మాణ శైలితో ఆకట్టుకుంటాయి. అలాంటి ప్రత్యేకమైన ఓ శివాలయం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అగస్త్యేశ్వరాలయం
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరాలయం చాలా ప్రాచీనమైనది. అతి ప్రాచీన ఈ శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో చోళుల కాలంలో, అప్పటి పాలకుడైన నంది చోళుడు నిర్మించినట్లుగా ఆలయంలో శాసనాల ద్వారా తెలుస్తోంది. అటు తర్వాత 15వ శతాబ్దంలో విజయనగర సేనాని నరస నాయకుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాడు. ఈ ఆలయం నాలుగు ద్వారాలతో, అరుదైన శిల్పకళతో, ప్రత్యేక పూజా విధానాలతో ప్రసిద్ధి చెందింది.
స్థల పురాణం
పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం కాశీ నుంచి దక్షిణ భారతానికి బయల్దేరిన అగస్త్య మహర్షి, తన దక్షిణదేశ యాత్రలో భాగంగా అనేక ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్టించాడు. అందుకో ఈ ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర లింగం కూడా ఒకటి.
ఆకట్టుకునే ఆలయ నిర్మాణ శైలి
అగస్త్యేశ్వరాలయం 140 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పు కలిగి నలుదిక్కులా నాలుగు ద్వారాలతో ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం అగస్త్యేశ్వర స్వామి కాగా, దేవేరి రాజరాజేశ్వరీ దేవి. ఆలయ పునరుద్ధరణలో భాగంగా పశ్చిమాన ఉన్న రాజగోపురంపై అయిదు బంగారు కలశాలను ప్రతిష్టించారు. తూర్పున కూడా మరో రాజగోపురం ఉంటుంది. ఉత్తర దక్షిణ రాజగోపురాలపై కూడా బంగారు కలశాలను దర్శించవచ్చు.
ఆలయ విశేషాలు
ఇక్కడ అగస్త్యేశ్వర స్వామి ఆలయంతో పాటు భ్రమర లింగేశ్వర, సుందరేశ్వర, కోదండరామ ఆలయాలు కూడా వెలసి ఉన్నాయి. అలాగే ప్రత్యేక నవగ్రహ మండపం ఉన్నాయి. అగస్త్యేశ్వర స్వామికి, రాజరాజేశ్వరీదేవికి విడివిడిగా ఆలయాలున్నప్పటికీ రెండు ఆలయాలను కలిపే మండపం మాత్రం ఒకటే ఉండడం విశేషం. గర్భాలయంలో అగస్త్యేశ్వర స్వామితో పాటు వీరభద్ర, వినాయక, కార్తికేయ సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ కార్తికేయుడు నెమలి వాహనంపై ఉండడం విశేషం.
అరుదైన నవగ్రహ మండపాలు
అగస్త్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహ మండపాలు సాధారణంగా ఇతర ఆలయాల్లో ఉండే మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. విలక్షమైన ఇలాంటి నవగ్రహ మూర్తులను ఒక్క కర్ణాటకలో రాష్ట్రంలోనే చూడవచ్చునని అంటారు.
వీరభద్రమూర్తి
అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో వెలసి ఉన్న వీరభద్ర స్వామి సమభంగ భంగిమలో నిల్చుని దర్శనమిస్తాడు. ఈ స్వామి కాళ్ల కింద మేక తల ఉండడం విశేషం.
రససిద్ధి గంటలు
గర్భాలయంలో వెలసి ఉన్న అగస్త్యేశ్వర స్వామి లింగంపై రససిద్ధికి సంబంధించిన గంటలు ఉండటం విశేషం. ఇది చాలా అరుదైన విశేషం.
సత్కవులతో సంబంధం
తెలుగునాట వెలసి ఉన్న కొన్ని ఆలయాలతో కవులకు మంచి సంబంధం ఉంటుంది. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలోని ఆంధ్రవిష్ణువు ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచించాడని అంటారు. అలాగే ఈ ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి ఓ కవికి కూడా సంబంధం ఉన్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆ క్షేత్ర మహిమకు ముగ్ధుడైన 20 వ శతాబ్దపు కవి సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు తమ గేయకావ్యం ‘శివతాండవాన్ని’ ఇక్కడే రచించినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇందుకు జ్ఞాపకార్థంగా ఆ మహాకవికి ఒక స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేయడం ఆలయ విశిష్టతకు అద్దం పడుతుంది.
ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయ సందర్శన వల్ల దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం.
ఎలా చేరుకోవాలి?
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు వెలసి ఉన్న అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి మెరుగైన రవాణా సౌకర్యాలున్నాయి.
మనం కూడా అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శివానుగ్రహాన్ని పొందుదాం.
ఓం నమః శివాయ!
