SGSTV NEWS
Andhra Pradesh

Tirumala: వకుళ మాత అతిథి గృహంలో రూమ్ శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది – కనిపించిన ఓ పొట్లం ఓపెన్ చేయగా

 

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన మధురై కుటుంబం రూ.12 లక్షల విలువైన బంగారు నగలను గదిలో మరిచి వెళ్లింది. అన్నమయ్య భవన్ పక్కనే వకుళమాత అతిథిగృహంలో సిబ్బంది నగలను గుర్తించి టీటీడీ అధికారులకు అప్పగించారు. శివ కుటుంబానికి నగలు తిరిగి అందజేయగా భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవారి దయతోనే తమ ఆభరణాలు దక్కాయని పేర్కొన్నారు.


తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనార్థం మధురై నుంచి వచ్చిన శివ కుటుంబం స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమైంది. అయితే వారు బస చేసిన గదిలో రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మరిచిపోయి వెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అన్నమయ్య భవన్ పక్కన ఉన్న క్యాప్రీ లోన్స్‌కి చెందిన వకుళమాత అతిథిగృహంలో గదినంబరు 5లో తాత్కాలిక వసతి తీసుకున్న ఈ కుటుంబం… తిరిగి సొంతూరుకు పయనమయ్యారు. ఆ తర్వాత ఆ గదిని శుభ్రం చేస్తున్న సిబ్బంది అక్కడ 128 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించారు. గోల్డ్ చైన్, రెండు రింగులు, కడియం తదితర నగలు ఉండగా.. టీటీడీ సిబ్బంది వెంటనే విషయం పద్మావతీ విచారణ కార్యాలయ అధికారులకు తెలియజేశారు.

సంబంధిత భక్తుల సమాచారం సేకరించిన అధికారులు.. ఆ నగలు మధురైకు చెందిన శివ కుటుంబానికి చెందినవిగా గుర్తించి.. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో శివ కుటుంబ సభ్యులు తిరిగి తిరుమలకు వచ్చి ఆభరణాలను స్వీకరించారు.



తమ సొత్తు సురక్షితంగా తిరిగి అందించిన టీటీడీ సిబ్బందికి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. స్వామివారి దయ వల్లే తమకు మళ్లీ నగలు దక్కాయని ఆనందంతో పేర్కొన్నారు.

Also read

Related posts

Share this