SGSTV NEWS
Telangana

Warangal: బాలికల హాస్టల్ నుంచి ఒక్కసారిగా వింత చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా



కాకతీయ యూనివర్సిటీలోని బాలికల హాస్టల్‌లో వింత చప్పుళ్లు రావడం మొదలయ్యాయి. బాలికలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటా అని చూడగా దెబ్బకు గుండె గుభేల్ అయింది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఈ స్టోరీ చూసేయండి.


వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్‌లో నల్లనాగు హల్ చల్ చేసింది. హాస్టల్ ఆవరణలోకి ప్రవేశించిన త్రాచుపాము దాదాపు రెండు గంటలపాటు విద్యార్థినిలు వణికిపోయేలా చేసింది. చివరకు స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పామును పట్టి బంధించడంతో విద్యార్థులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. హాస్టల్ పరిసరాల్లో పాములు, తేళ్లు, ఎలుకలు నిత్యం స్వైరవిహారం చేస్తున్నాయి. అపరిశుభ్రత కారణంగా పాములు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. విషపురుగులు ఏకంగా హాస్టల్ గదిలోకి తొంగిచూస్తున్నాయి. తాజాగా మరోసారి త్రాచుపాము గర్ల్స్ హాస్టల్‌లోకి ప్రవేశించింది. దాదాపు రెండు గంటల పాటు హాస్టల్ ఆవరణలో హల్చల్ చేసింది.

గర్ల్స్ హాస్టల్‌లోని E – బ్లాక్‌లోకి పాము ప్రవేశించింది. దీనితో హాడలెత్తిపోయిన విద్యార్థినిలు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన వార్డెన్, హాస్టల్ సిబ్బంది స్నేక్స్ క్యాచర్స్‌ను పిలిపించారు. సకాలంలో హాస్టల్‌కు చేరుకున్న స్నేక్స్ క్యాచర్ దాదాపు అర్ధగంట పాటు శ్రమించి ఆ పామును పట్టి బంధించాడు. దీంతో హాస్టల్ విద్యార్థినిలు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. హాస్టల్ పరిసరాల్లోని రంధ్రాలు పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా చాలా సందర్భాలలో పాములు హాస్టల్లోకి వచ్చినట్లుగా విద్యార్థినిలు చెప్తున్నారు. ఎలుకలు నిత్యం హాస్టల్ గదుల్లోకి వచ్చి విద్యార్థినిలను గాయపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రత, చెత్తా-చెదారం, పుట్టలు పేరుకుపోవడం వల్లే ఇలా పాములు, తేళ్లు విద్యార్థుల మధ్య సంచరిస్తున్నాయని.. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎవరు పాముకాటుకు గురికాలేదని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం కోసం వచ్చే విద్యార్థులకు ఈ కాకతీయ యూనివర్సిటీలో ఇలాంటి కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూనివర్సిటీ క్యాంపస్‌లో కాస్త పరిశుభ్రత ఉండే విధంగా ఏర్పాటు చేసి.. పాములు, తేళ్లు, విషపురుగుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు

Also Read

Related posts

Share this