SGSTV NEWS online
CrimeTelangana

ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..



పాత బంగారం ఇస్తే రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా కడిగి కొత్తవాటిలా మెరిపిస్తాం అంటూ నమ్మబలికిన కేటుగాళ్లు.. ఒక అమాయక మహిళ కష్టార్జితాన్ని క్షణాల్లో మాయం చేశారు. అసలు విషయం తెలిశాక సదరు మహిళ లబోదిబోమంది. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సిద్దిపేట జిల్లాలో జరిగింది ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే తొగుట (మం) వెంకట్రావుపేట గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పుస్తెల తాడు నుండి ఏకంగా 9 గ్రాముల బంగారాన్ని కత్తిరించి ఎత్తుకెల్లారు దుండగులు.

బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ దొంగలు, మోసగాళ్లు సరికొత్త పద్ధతులతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వెంకట్రావుపేట గ్రామంలోకి ఇద్దరు గుర్తుతెలియని యువకులు ప్రవేశించి, తమ వద్ద ఉన్న పౌడర్, రసాయన ద్రావణాలను చూపిస్తూ పాత బంగారు, వెండి ఆభరణాలను ఉచితంగా మెరిపిస్తామంటూ వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. మొదట గ్రామస్తులు ఎవరూ వారి మాటలను నమ్మకపోయినా, ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ కేటుగాళ్లు వారి పై తమ మాయ మాటల వల విసిరారు. దీనితో గ్రామానికి చెందిన కళ్లెపు అనూష అనే మహిళ ఆరుబయట బట్టలు ఉతుకుతుండగా ఈ ఇద్దరు కేటుగాళ్లు ఆమె వద్దకు వెళ్ళి, తాము తెచ్చిన కెమికల్స్ నిజంగానే పనిచేస్తాయని నమ్మించడానికి, ముందుగా ఆమె చేతుల పై ఒక పౌడర్ వేసి చల్లదనాన్ని అనుభూతి చెందేలా చేశారు.



వారి నటనను నిజమని నమ్మిన అనూష తన మెడలోని బంగారు పుస్తెల తాడును, అలాగే తన చెల్లికి సంబంధించిన వెండి పట్ట గొలుసులను అపరిచితులకు క్లీన్ చేయడానికి ఇచ్చింది. ఇక్కడే ఆ దొంగల ముఠా తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఒక ప్రత్యేక లిక్విడ్‌లో ఆ నగలను వేసి కడుగుతున్నట్లు నటిస్తూ.. అత్యంత చాకచక్యంగా బంగారు పుస్తెల తాడు నుండి సుమారు 9 గ్రాముల బంగారాన్ని కత్తిరించి, కరిగించి మాయం చేశారు. ఆపై మిగిలిన ఆభరణాలను తిరిగి ఇచ్చేసి క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత నగలను పరిశీలించిన అనూషకు అనుమానం వచ్చి, స్థానిక బంగారు దుకాణంలో తూకం వేయించగా ఏకంగా 9 గ్రాముల (సుమారు ఒక తులం) బంగారం మాయమైనట్లు తేలడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన కష్టార్జితం దొంగలపాలైందని సదరు మహిళ బోరున విలపించింది.

Also read

Related posts