మాస ఫలాలు (జూన్ 1-30, 2025): మేష రాశి వారికి మూడు గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలలో ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆదాయం వృద్ది చెందడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు మాస ఫలాలు (జూన్ 2025) ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రాశ్యధిపతి కుజుడు నాలుగు, అయిదు స్థానాల్లో, రాహువు లాభ స్థానంలో, గురువు తృతీయ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల నెలంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఈ మూడు గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా తప్పకుండా పురోగతి ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు, వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో అత్యధికంగా లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
లాభ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఆర్థిక విషయాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పదవీ యోగం పట్టే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రద్ధ పెంచాలి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఈ రాశిలో గురువు, లాభ స్థానంలో శుక్రుడు, మిత్ర క్షేత్ర, స్వస్థానాల్లో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల నెలంతా శుభవార్తలు, శుభ పరిణామాలతో సాగిపోతుంది. ఆదాయం వృద్ది చెందడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఉద్యోగంలో రాజయోగాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా చక్కబడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. సొంత ఇంటి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశికి ప్రస్తుతం కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితం సవ్యంగా, సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. నెల ప్రథమార్థంలో రవి లాభ స్థానంలో అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం వృద్ధి చెందడం, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం కావడం, ఆరోగ్యం కుదుటపడడం జరుగుతుంది. ద్వితీయార్థంలో ఖర్చులు బాగా పెరు గుతాయి. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలకు లోటుండదు. ప్రస్తుతానికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. కొద్ది శ్రమతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి దశమ, లాభ స్థానాల్లో, గురువు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ప్రస్తుతానికి అష్టమ శని వర్తించకపోవచ్చు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఇంటా బయటా కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు బాగా ఉపయోగపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. తలపెట్టిన వ్యవహారాలు, పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశ్యధిపతి బుధుడు భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేయడం, షష్ట స్థానంలో రాహువు ఉండ డం వల్ల ఆదాయానికి లోటుండదు. ఆదాయాన్ని పొదుపు చేసి, మదుపు చేసి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా దాదాపు పూర్తిగా బయటపడతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా నష్ట పోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. వృథా ఖర్చులకు అవకాశ ముంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ఇతరుల విషయాల్లో తల దూర్చకపోవడం మంచిది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడు సప్తమంలో, శని షష్ట స్థానంలో, గురువు భాగ్య స్థానంలో సంచారం వల్ల నెలంతా సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది. ప్రధాన గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అయితే, సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొందరు బంధుమిత్రుల జోక్యం కారణంగా డబ్బు నష్ట పోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. విద్యార్థులు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యపీగా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రాశ్యధిపతి కుజుడు భాగ్య, దశమ స్థానాల్లో, కేతువు లాభ స్థానంలో సంచరించడం వల్ల ఆదాయా నికి, ఆరోగ్యానికి లోటుండదు. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. రావలసిన డబ్బు వసూలు అవుతుంది. అష్టమ స్థానంలో ఉన్న గురువు వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అదుపు తప్పుతుంది. దైవ కార్యాలకు, దాన ధర్మాలకు ధనం వ్యయమైపోతుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యో గంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్ధులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో, రాహువు తృతీయంలో సంచారం చేయడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం బాగా తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. షష్ట స్థానంలో రవి, బుధులు కలిసి ఉండడం వల్ల ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండడం మంచిది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, బుధ రవులు పంచమంలో, శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరవ స్థానంలో గురువు సంచారం కారణంగా ఇంటా బయటా పనిభారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అయ్యే అవకాశం ఉంది. ఎటువంటి ఆటంకాలూ లేకుండా ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. విద్యార్థులకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశముంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
చతుర్థ స్థానంలో రవి, బుధులు, పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఏలిన్నాటి శని వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు, అనవసర ఖర్చులు, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోవడం, అవమానాలు వంటివి తప్పక పోవచ్చు. ప్రస్తుతానికి ఇతరులకు డబ్బు ఇవ్వడం కానీ, వారి నుంచి తీసుకోవడం గానీ పెట్టుకోవద్దు. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. సహోద్యోగితో కానీ, పరిచయస్థుల్లో గానీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆస్తి సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఏలిన్నాటి శని వల్ల ప్రతి పనీ ఆలస్యమవుతుంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు మందగిస్తాయి. అయితే, రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో, శుక్రుడు ధన స్థానంలో ఉండడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కొద్ది శ్రమతో అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. కుటుంబంలో, దాంపత్య జీవితంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిర త్వం లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యక్తిగత రహస్యాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా గడిచిపోతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు