ఉద్యోగాలు, పెళ్లి, ప్రేమ పేరుతో పలువురు యువతుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న శ్రీనివాస్ కిరణ్ – ప్రతి మోసానికో సిమ్, మొబైల్ వాడుతున్న నిందితుడు -చివరకు పోలీసుల వలలో చిక్కిన వైనం
తన ఉనికి ఎక్కడా పోలీసులకు దొరక్కుండా నిందితుడు చాలా జాగ్రత్తగలు తీసుకున్నాడు. ఫక్తు నేరగాడికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రతి మోసానికో సిమ్, మొబైల్ వాడుతుంటాడు. ఏవీ అతని పేరుపై కొనుగోలు చేయడు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరకు పోలీసుల వలలో చిక్కాడు. ఉద్యోగాలు, పెళ్లి, ప్రేమ పేరుతో తెలుగు రాష్ట్రాలు, బెంగళూరులో పలువురు యువతుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న శ్రీనివాస్ కిరణ్‌ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విచారించిన అనంతరం నోటీసులు ఇచ్చి పంపించారు.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడికి చెందిన పూనాటి శ్రీనివాస్ కిరణ్ బాబు ఎంసీఏ చదివాడు. అనంతరం హైదరాబాద్ వెళ్లి అక్కడ పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేశాడు. ఓ సాప్ట్వేర్ కంపెనీలోని మానవవనరుల విభాగంలో పనిచేసే సమయంలో పరిచయమైన యువతిని మభ్యపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వ్యాపారం నిమిత్తం ఆమె నుంచి రూ. 27 లక్షలు తీసుకున్నాడు. ఇలా మోసాల ద్వారా వచ్చిన సొమ్మును క్రికెట్ బెట్టింగ్, తాగుడు కోసం వెచ్చించేవాడు. సొమ్మును నేరుగా తీసుకోకుండా క్రికెట్ బెట్టింగ్ యాప్‌లకే బదిలీ చేయించేవాడు.
వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్‌లు : విజయవాడకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫోన్ చేసి ఎస్ఏపీ సర్టిఫికేషన్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని ఆ యువతి తిరస్కరించడంతో వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్‌లు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. దీనిపై సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు అయింది. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సిమ్‌లను కాకినాడలో యాక్టివేట్ చేసినట్లు తేలింది. అక్కడకు వెళ్లి సిమ్ల విక్రేతను విచారించగా, నిందితుడి ఆనవాళ్లు దొరకడంతో ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిమ్ తాలూకూ టవర్ లొకేషన్ ద్వారా విజయవాడలో అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఆరు సిమ్‌లు, నాలుగు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పలు విషయాలకు బయటకు వచ్చాయి.
హోల్‌సేల్‌గా సిమ్‌లు విక్రయిస్తుంటానని చెప్పి విజయవాడలోని ఓ దుకాణంలో శ్రీనివాస్ కిరణ్ గంపగుత్తగా కొనుగోలు చేసేవాడు. ఒక్కో విడతలో 10 చొప్పున తీసుకునేవాడు. సిమ్‌ను తన మొబైల్లో వేసుకుని యాక్టివేట్ చేయడు. సిమ్‌ను ఫొటో తీసి దానిని కాకినాడలోని వ్యక్తికి పంపించేవాడు. అతను యాక్టివేట్ చేసిన తర్వాత మొబైల్లో వేసుకుని ఉపయోగించేవాడు. ప్రతి మోసానికి కొత్త మొబైల్ ఉపయోగించేవాడు. మొబైల్ కూడా తన పేరున కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు.
ఉద్యోగాల పేరుతో డబ్బు వసూళ్లు : కోడ్ ల్యాబ్ ఇంటర్నేషనల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేసిన కాలంలో ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని 15 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అసలు విషయం బయటపడడంతో వీరు హైదరాబాద్‌లోని మాదాపూర్, ఖమ్మం రెండో పట్టణ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్‌లో ఉద్యోగం నుంచి తొలగించిన అనంతరం విశాఖపట్నంకు మకాం మార్చాడు. టెక్టన్ స్టఫింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెచ్ఆర్ మేనేజర్‌గా చేరాడు. సంస్థకు తెలియకుండా ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువతి నుంచి రూ.లక్ష వసూలు చేశాడు.
2020లో మ్యాట్రిమోనీ, డేటింగ్ సైట్లలో ఎకౌంట్ తెరిచి మోసాలు చేయడం ప్రారంభించాడు. బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రూ. 44.45 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. వారి వద్ద డబ్బులు లేకపోతే రుణాలకు దరఖాస్తు చేయించి మరీ తీసుకునేవాడు. రెండు రాష్ట్రాల్లోని హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, చిత్తూరు, విశాఖపట్నం, బెంగళూరు, తదితర చోట్ల 10కి పైగా కేసులు ఉన్నాయి. రూ. 2 కోట్లకు పైగా తీసుకుని మోసాలకు పాల్పడ్డాడు. ఇంకా చాలా మోసాల్లో బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసులు నమోదు కాలేదు. వ్యసనాలకు గురై నిందితుడు కిరణ్‌బాబు మోసాలకు పాల్పడుతుండడంతో తల్లిదండ్రులు అతడిని ఇంటికి రావొద్దని హెచ్చరించి వెలివేశారు.
తక్కువ వడ్డీ రేటని ఆన్లైన్లో రుణాలిస్తారు – ఆపై అందినకాడికి దోచేస్తారు
యువతి పేరుతో పరిచయం – సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ.81 లక్షలకుపైగా కాజేసిన కేటుగాళ్లు
Also read
- మరో మహిళతో అల్లుడు సహజీవనం – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ –
- హైటెక్ మోసగాడు – ఉద్యోగాలు, ప్రేమ, పెళ్లి పేరుతో యువతులకు వల – చివరికి?
- చనిపోయిందని నమ్మించి శిశువు మాయం.. చివరికి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం!
- దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్.. పోలీసుల మైండ్ బ్లాక్ చేస్తున్న వింత చోరీ
- సెల్‌ఫోన్ సినిమాలు చూస్తున్నారా..!




