రెండేళ్లుగా ప్రేమించిన వ్యక్తే తన జీవిత భాగస్వామి అవుతాడని నమ్మింది. అతడితో కలిసి కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని ఎన్నో కలలు కన్నది.
మహాబూబాబాద్ : రెండేళ్లుగా ప్రేమించిన వ్యక్తే తన జీవిత భాగస్వామి అవుతాడని నమ్మింది. అతడితో కలిసి కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని ఎన్నో కలలు కన్నది. కానీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి కులం అడ్డంకిగా మారిందని, ప్రేమించిన యువకుడు ముఖం చాటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన ఆవేదనను 21 పేజీల లేఖలో వెల్లడించి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మహబూబాబాద్ మండలం నడివాడలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మునిగె కుమారస్వామి, సుకన్య దంపతుల పెద్ద కుమార్తె సుస్మిత (24) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఎస్సై ఉచిత శిక్షణకు హాజరవుతోంది. ఇదే గ్రామానికి చెందిన అనిల్ తో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వివాహం చేసుకోవాలని కోరగా, వేరే కులానికి చెందిన యువతి కావడంతో తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదంటూ అనిల్ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడని ఆరోపించారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత తనకు జరిగిన అన్యాయాన్ని 21 పేజీల లేఖలో వివరించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తనను మోసం చేసిన వారిని వదలొద్దంటూ తల్లిదండ్రులకు చివరి సందేశం ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు సుస్మిత మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనిల్ అనే యువకుని తో పాటు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులే ఆమె మరణానికి కారణమని ఆరోపిస్తూ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మహబూబాబాద్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లేఖను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
న్యాయం కోసం కుటుంబ సభ్యుల ధర్నా!
తమ కుమార్తె మరణానికి బాధ్యులైన వారిని వదలొద్దని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. అనిల్‌ను ఎన్ కౌంటర్ చేయాలని, అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ పట్టణంలోని అండర్ బ్రిడ్జి వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also read
- తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్‌పై సీనియర్ దాడి… Video
- మద్యానికి బానిసై.. డబ్బుల కోసం భార్య దారుణ హత్య
- వికారాబాద్ లొ విషాదం.. యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య
- మహాబూబాబాద్..21 పేజీల లేఖ రాసి యువతి బలవన్మరణం
- రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ అడిగి ఇంటికి తీసుకెళ్లిన మహిళ.. ఆపై దుస్తులు విప్పేసి!… వీడియో





