తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో
తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జాతీయ స్థాయిలో రాణించాలనే కలలతో ఇటీవలే బీసీసీఐ (BCCI) అండర్-19 జట్టుకు ఎంపికైన యువ మహిళా క్రికెటర్ నందిని (17) బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబం, క్రీడా వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగయ్యపల్లి గ్రామానికి చెందిన నందిని వికారాబాద్ పట్టణంలో ఉంటూ క్రికెట్ కోచింగ్ తీసుకుంటోంది. తన ప్రతిభతో ఇటీవలే బీసీసీఐ అండర్-19 జట్టుకు ఎంపికై, ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె అకస్మాత్తుగా ఉరేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. నందిని ఆత్మహత్యకు ఇద్దరు యువకుల వేధింపులే ప్రధాన కారణమని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా వారి వేధింపులు భరించలేకనే తీవ్ర మనస్తాపానికి గురై నందిని ఈ కఠిన నిర్ణయం తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధితుల ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వేధింపులకు పాల్పడినట్లు చెబుతున్న ఇద్దరు యువకుల వివరాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
