SGSTV NEWS online
CrimeTelangana

అంతా అయ్యప్ప పడిపూజలో బిజీ.. వీడు ఏం చేశాడో తెలుసా..? సీసీ కెమెరాలో మొత్తం బయటపడింది..



ఖమ్మం జిల్లా మధిరలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం సందర్భంగా చోరీ ఘటన కలకలం రేపింది. భక్తులంతా భజనలో నిమగ్నమై ఉండగా, ఓ యువకుడు బాలుడి మెడలో ఉన్న సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు గొలుసును అపహరించాడు. అయితే అపార్ట్‌మెంట్ సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డవడంతో నిందితుడిని గుర్తించిన కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో అతడు గొలుసును తిరిగి అప్పగించినట్లు సమాచారం.


మధిర (ఖమ్మం జిల్లా): అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాల ఏర్పాటు ఎంత అవసరమో మధిర పట్టణంలో జరిగిన ఓ ఘటన మరోసారి నిరూపించింది. అయ్యప్ప పడిపూజ భజన కార్యక్రమంలో భక్తులందరూ నిమగ్నమై ఉన్న సమయంలో ఓ బాలుడి మెడలోని బంగారు గొలుసును అపహరించిన యువకుడి బండారాన్ని సీసీ కెమెరాలు బయటపెట్టాయి. అసలేం జరిగిందంటే.. బుధవారం రాత్రి మధిర పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అయ్యప్ప పడిపూజ భజన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. అక్కడున్న వారంతా భజనలో మునిగిపోయి ఉండగా, ఓ యువకుడు అదను చూసి ఓ బాలుడి మెడలో ఉన్న సుమారు రూ. 3 లక్షల విలువైన బంగారు గొలుసును చాకచక్యంగా అపహరించాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత బాలుడి మెడలో గొలుసు కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అందులో ఓ యువకుడు గొలుసును దొంగిలిస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.

దొరికిపోవడంతో తిరిగిచ్చిన నిందితుడు:
సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన బాధిత కుటుంబ సభ్యులు నేరుగా అతని ఇంటికి వెళ్లి నిలదీశారు. తొలుత తనకేమీ తెలియదని బుకాయించిన ఆ యువకుడు, కుటుంబ సభ్యులు ఫోన్‌లో ఉన్న సీసీ కెమెరా ఆధారాలను చూపించడంతో కంగుతిన్నాడు. చేసేదేమీ లేక తన జేబులో ఉన్న బంగారు గొలుసును తీసి వారికి అప్పగించాడు. ఈ విషయాన్ని ఎక్కడా బయటకు చెప్పవద్దని వేడుకున్నట్లు సమాచారం.


విలువైన రూ. 3 లక్షల బంగారు గొలుసు క్షేమంగా తిరిగి లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుని ఆనందం వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణకు ప్రతి అపార్ట్‌మెంట్, కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు నిత్యం సూచిస్తున్నప్పటికీ.. ఖర్చుకు వెనుకాడుతూ చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను చాటిచెప్పిన ఈ ఘటన అందరికీ కనువిప్పు కలిగించేలా ఉంది

Also read

Related posts