SGSTV NEWS online
CrimeTelangana

ఎవర్రా మీరంతా.. కార్లలో వస్తారు.. పశువులకు మత్తు మందు ఇస్తారు.. ఆ తర్వాత..



ఆదిలాబాద్ జిల్లాలో పశువుల చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కార్లలో వచ్చి పశువులకు మత్తు మందు ఇచ్చి మహారాష్ట్రలోని వధశాలలకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేయగా, మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు.


ఆదిలాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా రైతుల వ్యవసాయ పొలాలు, ఇళ్ల వద్ద కట్టేసిన పశువులు, అలాగే రోడ్లపై సంచరించే ఆవులు, ఎడ్లు కనిపించకుండా పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు నిఘా పెంచగా, అంతర్‌రాష్ట్ర పశువుల చోరీ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


కార్లలో వచ్చి పశువులకు మత్తు మందు ఇంజెక్ట్ చేసి అపహరిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో రాత్రి వేళల్లో పశువులు మాయమవుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన పశువుల చోరీ కేసును సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించినట్లు వెల్లడించారు.

నిందితులు భారీ కార్లలో వచ్చి, వాటి వెనుక సీట్లను తొలగించి, పశువులకు మత్తు మందు ఇచ్చి వాహనాల్లో ఎక్కించి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలోని వధశాలలకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. అక్కడ పశువులను విక్రయించి భారీ మొత్తంలో అక్రమ లాభాలు పొందుతున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ ముఠాలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పశువుల చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. పోలీసుల కంటపడకుండా ఉండేందుకు నిందితులు వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చుకుని, టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టులు లేని మార్గాలను ఎంచుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.


ఈ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారిలో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, వారి వద్ద నుంచి ఒక కారు, ఐదు సెల్‌ఫోన్లు, నకిలీ నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గత ఏడాదిన్నర కాలంలో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, తాంసి, జైనథ్, ఆదిలాబాద్ వన్‌టౌన్, టూ‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో జరిగిన మొత్తం ఏడు పశువుల చోరీ ఘటనలకు ఇదే ముఠా పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. అలాగే నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో కూడా వీరిపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

పశువుల చోరీలకు సంబంధించిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ దృశ్యాలు, వాహనాల కదలికలు, సాంకేతిక ఆధారాలు, కాల్‌డేటా విశ్లేషణ ద్వారా కేసును ఛేదించినట్లు ఎస్పీ వివరించారు.

ప్రజలు తమ పశువులను రాత్రి వేళల్లో సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

అరెస్టయిన నిందితులు

మొహమ్మద్ షాహిద్ హబీబ్ ఖాద్రి (31), భివాండి, థానే జిల్లా, మహారాష్ట్ర.

ఆలం షేక్ అనీష్ (24), ముంబై, మహారాష్ట్ర.

ఫర్మాన్ సబీర్ షేక్ (27), కుర్లా ఈస్ట్, ముంబై, మహారాష్ట్ర.

షేక్ తబాస్ షకీల్ (21), కళ్యాణ్ వెస్ట్, థానే జిల్లా, మహారాష్ట్ర.

వసీం ఖురేషీ (21), భివాండి, థానే జిల్లా, మహారాష్ట్ర.

పరారీలో ఉన్న నిందితులు

రహీమ్ (మీరుపాడ్, ముంబై), మొహమ్మద్ ముర్తుజా అలియాస్ అల్తాఫ్ (కళ్యాణ్ వెస్ట్), అజీమ్ రౌఫ్ గాజీ అలియాస్ అజ్జు (కళ్యాణ్ వెస్ట్), నబీ బిల్డర్ (పశువులను వధశాలలకు తరలించే వ్యక్తి), తౌకీర్, పాపు తాండా, బాబు అలియాస్ సయ్యద్ సమీర్, ఖయ్యూమ్ బటారియా (ఉత్తరప్రదేశ్) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read

Related posts