SGSTV NEWS online
CrimeEntertainmentSpiritual

గంగాజలంతో శివయ్యకు అభిషేకం- వందల కిలోమీటర్లు సాగే పవిత్ర కన్వర్ యాత్ర విశిష్టత తెలుసా?



పరమశివుడికి గంగాజలంతో అభిషేకం చేయడానికి భక్తులు వందల కిలోమీటర్లు కాలినడకన చేసే పవిత్ర యాత్ర- శ్రావణ మాసంలో జరిగే ఈ యాత్రలో భక్తులు గంగాజలాన్ని కావిళ్లలో మోసుకెళ్లి శివాలయాల్లో అభిషేకం
Kanwar Yatra 2026

Kanwar Yatra Significance: ‘శివో అభిషేక ప్రియః’ అంటుంది శాస్త్రం. ఆడంబరాలకు ఆమడ దూరంలో ఉండే శివయ్యకు కాసిని నీళ్లతో అభిషేకం చేస్తే చాలు కరుణించి వరాలు కురిపిస్తాడు. గంగాజలాభిషేకంతో ప్రీతి చెందే భోళాశంకరుని అభిషేకం కోసం వందల మైళ్లు కాలి నడకన ప్రయాణించి కావిళ్లతో గంగాజలాన్ని మోసుకెళ్లే పవిత్రమైన యాత్రను కన్వర్ యాత్ర అంటారు. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ నుంచి మొదలయ్యే ఈ యాత్ర ఈ ఏడాది జులై 29 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కన్వర్ యాత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉత్తరాదిన శ్రావణం

దక్షిణ భారతంలో శివారాధనకు కార్తిక మాసం ఎంత ప్రత్యేకమో, ఉత్తరభారతంలో శివారాధనకు శ్రావణ మాసం అంత విశిష్టమైనది. ఉత్తర భారతంలో పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు నూతన మాసాన్ని గణిస్తారు. ఆ ప్రకారంగా గురు పౌర్ణమి నుంచి ఉత్తర భారతంలో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఉత్తర భారతంలో శ్రావణ మాసం ప్రారంభం కాగానే శివాలయాలన్ని పంచాక్షరీ మంత్రం ఘోషతో మారుమ్రోగుతుంటాయి. ఈ పవిత్ర శ్రావణ మాసంలో చేసే కన్వర్ యాత్ర విశేషాలు గురించి తెలుసుకుందాం.

పరశురాముడు ప్రారంభించిన కన్వర్ యాత్ర
ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం పరశురాముడు మొట్టమొదటిసారిగా ఈ కన్వర్ యాత్రను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పరశురాముడు ఉత్తరాఖండ్లోని ముక్తేశ్వర్ ధామ్ నుంచి కాలి నడకన కావిళ్లతో గంగాజలాన్ని తీసుకువచ్చి ఉత్తరప్రదేశ్లోని బాగ్‌పత్ సమీపంలో ఉన్న ‘పుర మహాదేవుడి’ని అభిషేకించాడని నమ్మకం. ఈ కన్వర్ యాత్ర చేసే వారిని కన్వారీలు అంటారు.

పురాణ ప్రాశస్త్యం
పురాణాలలో పేర్కొన్న కన్వర్ యాత్రకు సంబంధించిన గాథను ఈ సందర్భంగా ప్రస్తావించుకుందాం. పురాణాల ప్రకారం, క్షీరసాగర మథన సమయంలో హాలాహలం ఉద్భవించినప్పుడు, పరమశివుడు దానిని సేవించి తన కంఠంలో నిలుపుకుని గరళకంఠుడయ్యాడు. పరమేశ్వరునిపై ఆ విషం ప్రభావాన్ని తగ్గించడానికి శ్రీరాముడు కన్వర్ సహాయంతో గంగాజలాన్ని తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేశాడని నమ్ముతారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. అటు తర్వాత త్రేతాయుగానికి చెందిన పరశురాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ ఆచారాన్ని కొనసాగించాడని పురాణాలు చెబుతున్నాయి.

కన్వర్ యాత్ర ఎలా చేస్తారు?
కన్వర్ యాత్ర చేసే శివభక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గంగోత్రి లేదా బిహార్‌లోని సుల్తాన్‌గంజ్ వంటి పవిత్ర ప్రాంతాలకు కాలినడకన చేరుకుంటారు. అక్కడ గంగా నది నుంచి పవిత్ర గంగా జలాలను బిందెలలో నింపుకుంటారు.

కావడి మోయడం
గంగాజలంతో నిండిన రెండు బిందెలను ఒక వెదురు కర్రకు ఇరువైపులా కడతారు. ఈ పరికరాన్ని ‘కన్వర్’ లేదా కావడి అంటారు. ఈ కావడిని భక్తులు తమ భుజాలపై పెట్టుకుని, ఎంతో నియమనిష్టలతో, శివనామస్మరణతో వందల కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ తమ స్వగ్రామాలకు లేదా ప్రసిద్ధ శివాలయాలకు చేరుకుంటారు.

శివుడికి అభిషేకం
కన్వర్ యాత్రికులు తాము మోసుకొచ్చిన గంగా జలాన్ని శ్రావణ మాసంలో శివరాత్రి రోజున తమ స్వగ్రామంలో ఉన్న శివయ్యకు భక్తిపూర్వకంగా అభిషేకం చేస్తారు.

బహుళ ప్రాచుర్యం
1980ల వరకు ఇది కొంతమంది సాధువులు మాత్రమే చేసే చిన్న యాత్రగానే ఉండేది. కానీ ప్రస్తుతం ఈ కన్వర్ యాత్ర భారతదేశంలోనే అతిపెద్ద వార్షిక ఆధ్యాత్మిక యాత్రగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ కన్వర్ యాత్రలో పాల్గొంటున్నారు.

డాక్ కన్వర్ యాత్ర

ఇది కన్వర్ యాత్రలో అత్యంత కఠినమైన రూపం. ఈ యాత్రలో భాగంగా కన్వరీలు గంగాజలాన్ని కావళ్లలో నింపుకున్న తర్వాత ఎక్కడా ఆగకుండా, నిరంతరం నడుస్తూ, పరిగెడుతూ గంగాజలాన్ని నిర్ణీత సమయానికి తమ గ్రామాల్లోని శివాలయానికి చేరుతారు.

కన్వర్ యాత్రకు ఈ నియమాలు తప్పనిసరి
కన్వర్ యాత్ర చేసే వారిని కన్వారీలు లేదా కన్వరియాస్ అని పిలుస్తారు. కొందరు భక్తులు వీరిని భోలే బాబా అని కూడా భక్తితో పిలుస్తుంటారు. ఈ కన్వర్ యాత్రలో పాల్గొనే భక్తులు కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. అవేంటో చూద్దాం.

కన్వర్ యాత్ర ఆచరించే కన్వారీలు పాదచారులై, చెప్పుకు కూడా ధరించకుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

యాత్రలో భాగంగా కన్వారీలు కాషాయ వస్త్రాలు మాత్రమే ధరించాలి.

కన్వర్ యాత్ర చేసే భక్తులు తప్పనిసరిగా సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్య మాంసాలు తీసుకోరాదు.

యాత్రికులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కావిడిని నేలపై ఉంచకూడదు. ఇలా చేస్తే కన్వర్ యాత్ర అసంపూర్ణం అని భావిస్తారు.

కావిడిని చెట్టు కొమ్మకు వేలాడిదీసి ఉంచాలి. ఒకవేళ పొరపాటున నేలపై ఉంచితే తిరిగి యాత్ర మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది.

ప్రతిసారి కావిడిని స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి.

భుజంపై గంగాజలాన్ని కావిళ్లలో మోస్తున్నంత సేపు ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉండాలి.

అలాగే దీక్ష చేపట్టిన వ్యక్తులు తప్ప ఎవరు పడితే వారు కావిళ్లను మోయకూడదని గుర్తుంచుకోవాలి.

భక్త జనసంద్రంగా మారే గంగాతీరాలు
శ్రావణ మాసం మొత్తం గంగానది పరివాహక ప్రాంతాలన్నీ కన్వర్ యాత్ర చేసే భక్తులతో సందడిగా మారుతాయి. ఎటు చూసినా శివనామ స్మరణ చేసే కన్వర్ యాత్రికులతో ఈ ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది.

మనం కూడా కన్వర్ యాత్రలో పాల్గొని శివయ్య అనుగ్రహాన్ని పొందుదాం.

ఓం నమః శివాయ!


Related posts