ప్రేమ ఊపిరి పోస్తుంది అనుకుంటే అతడి ఊపిరి తీసింది. ఓయూలో ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన విద్యార్థులు అతడిని ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకుండా పోయింది. యువతి అన్న ఆ ఒక్క మాటతో కుంగిపోయిన యువకుడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
విద్యాకుసుమాలు వికసించాల్సిన ఓయూ క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి దూరం పెట్టిందన్న మనస్థాపంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాంధీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ సమీపంలో ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి గాంధీ ఆసుపత్రికి తరలించారు. సుమారు 70 శాతం పైగా కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడు, వైద్యులు శ్రమించినప్పటికీ మృతి చెందాడు.
సూసైడ్ నోట్లో సంచలన విషయాలు
ఘటనా స్థలంలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్ ఈ ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించింది. తాను సాహితి అనే యువతిని గాఢంగా ప్రేమించానని, అయితే ఆమె తనను మోసం చేసిందని బాధితుడు లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన ప్రియురాలికి ఒక అబ్బాయిని పరిచయం చేయగా, ఆ అబ్బాయి తన గురించి చెడుగా చెప్పడంతో ఆమె బ్రేకప్ చెప్పిందని అందులో రాశాడు. గతంలోనే ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిన ఈ యువకుడు, తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఇదే విషయంపై ఆమెను నిలదీయగా.. ‘‘నిన్ను టైంపాస్ కోసం ప్రేమించాను’’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తీవ్ర డిప్రెషన్‌కు లోనైనట్లు లేఖలో వివరించాడు.
కుటుంబంలో నిండిన విషాదం
ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడని ఆశించిన కొడుకు, ప్రేమ పేరుతో ఇలా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక చిన్న మాటకో లేదా ప్రేమ విఫలమైందన్న కారణంతోనో ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు మరియు కౌన్సిలింగ్ నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు. ఈ ఘటనపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!
- మాదాపూర్‌లో విషాదం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగింది?
- Hyderabad: మరోసారి నేపాలి గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్ తో దోపిడీ!
- Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!
- ద్రౌపది పాండవులను వివాహం చేసుకోవడం వెనుక ఉన్న రహస్యం ద్విజన్మ రహస్యం!





