SGSTV NEWS online
Telangana

ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ విజేత* *శంకరరావుకు ఎస్‌బీఐ అధికారుల ఘన సన్మానం


*74 ఏళ్ల వయసులో ప్రపంచ వేదికపై రెండు పతకాలు సాధించడం స్ఫూర్తిదాయకం: ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ పి.జి.ఎన్. శర్మ*

*పాల్వంచ, అక్టోబర్ 30*

అమెరికాలోని నెవాడా రాష్ట్రం రెనో నగరంలో ఇటీవల జరిగిన ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఒక రజతం, ఒక కాంస్య పతకం సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి డి.వి. శంకరరావును శుక్రవారం సాయంత్రం పాల్వంచలోని ఎస్‌బీఐ RACPC కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.



ఈ సందర్భంగా ఎస్‌బీఐ కొత్తగూడెం RBO రీజినల్ మేనేజర్ శ్రీ పి.జి.ఎన్. శర్మ మాట్లాడుతూ, 74 ఏళ్ల వయసులోనూ అసాధారణ పట్టుదలతో ప్రపంచస్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన శంకరరావు విజయం యువతతో పాటు వయోవృద్ధులందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు.

2012లో గుండె బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ, ఆత్మవిశ్వాసంతో పవర్‌లిఫ్టింగ్‌లో జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ప్రపంచ వేదికపై పతకాలు సాధించడం విశేషమని అభినందించారు.

అక్టోబర్ 15న జరిగిన వరల్డ్ మాస్టర్స్ క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం, అక్టోబర్ 22న జరిగిన ఎక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన శంకరరావు, మాస్టర్స్-4 విభాగంలో 74 కిలోల బరువు కేటగిరీలో ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ పి.జి.ఎన్. శర్మ, RACPC చీఫ్ మేనేజర్ శ్రీ కుశద్వజ సేథీతో కలిసి శంకరరావును శాలువాతో సత్కరించి, భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి విగ్రహంతో కూడిన జ్ఞాపికను, కానుకలను అందజేసి అభినందించారు.

భద్రాచలానికి చెందిన శంకరరావు ఎస్‌బీఐలో అధికారిగా పదవీ విరమణ చేసిన అనంతరం ప్రస్తుతం పాల్వంచ RACPCలో ఆడిట్ అసిస్టెంట్‌గా సేవలందిస్తున్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో ఎస్‌బీఐ RACPC పాల్వంచ, AMCC సారపాక కార్యాలయాల సిబ్బంది పాల్గొని శంకరరావును అభినందించారు.

వయసు, ఆరోగ్యపరమైన సవాళ్లు విజయానికి అడ్డంకులు కావని నిరూపించిన శంకరరావు క్రీడా ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

Also read

Related posts