అధిక వడ్డీ ఆశ చూపిస్తే చాలు.. అమాయక జనం ఆకర్షితులవుతారని భావించిన ఆ జంట కోట్లకు పడగలెత్తింది. తక్కువ ధరకే బంగారం, భారీగా వడ్డీలంటూ నమ్మించి సుమారు 25 కోట్ల రూపాయల మేర టోకరా వేసింది. తణుకు పట్టణంలో వెలుగుచూసిన ఈ కిలాడీ జంట బాగోతం ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనంగా మారింది.
పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి వంచిస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఆ కోవలోనే తాజాగా బంగారం కూడా చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో వెలుగుచూసిన ఒక భారీ ఆర్థిక మోసం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అధిక వడ్డీ ఆశ చూపి, తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ ఒక కిలాడీ జంట అమాయక ప్రజలను, ముఖ్యంగా మహిళలను నమ్మించి కోట్లాది రూపాయల మేర టోకరా వేసింది. సుమారు 25 కోట్ల రూపాయల మేర సాగిన ఈ భారీ కుంభకోణంలో బాధితులు ఇంకా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. బాధితుల కథనం ప్రకారం.. తణుకు పట్టణానికి చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్ అనే దంపతులు లక్ష రూపాయలకు నెలకు 10 వేల నుండి ఏకంగా 30 వేల రూపాయల వరకు వడ్డీ ఇస్తామని నమ్మబలికారు. కేవలం వడ్డీ మాత్రమే కాకుండా బయట మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కేవలం 12 వేల రూపాయలకే గ్రాము బంగారం ఇప్పిస్తామంటూ ఆశ చూపారు. వీరి మాటలు నమ్మిన పలువురు మహిళలు తమ వద్ద ఉన్న నగదుతో పాటు బంధువులు, స్నేహితుల వద్ద నుంచి కూడా అప్పులు తెచ్చి మరీ ఈ జంటకు అప్పగించారు. మొదట్లో నమ్మకం కలిగించడం కోసం కొందరికి వడ్డీలు చెల్లించి, ఆపై చేతులు ఎత్తేయటంతో ఇపుడు వారి చేతిలో మోస పాయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల్లో ఒకరైన ఉషారమ్య తాను 25 లక్షల నగదు, 30 కాసుల బంగారాన్ని సదరు జంటకు ఇచ్చినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా ఆమె ద్వారా ఆమె కుటుంబ సభ్యులు, పరిచయస్తుల నుండి మరో 40 లక్షల నగదు, 60 కాసుల బంగారాన్ని కూడావారికి ఇచ్చినట్లు చెబుతున్నారు. మరో బాధితురాలు శైలజ సైతం తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు ఏకరువు పెట్టారు. ఆమె నుంచి 36 కాసుల బంగారం, 44 లక్షల రూపాయల నగదును ఈ జంట కాజేసినట్లు వివరించారు. నగదు బదిలీకి సంబంధించిన వీడియోలు, ఇతర పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసిన బాధితులను ఈ కిలాడీ జంట రకరకాలుగా భయాందోళనలకు గురిచేసినట్లు తెలుస్తోంది. బాధితులపైనే తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని, పరువు తీస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు విరు ఆరోపిస్తున్నారు.
కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దుర్గాప్రసాద్ గతంలో ఒక బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేసిన అనుభవం ఉండటంతో అదే రంగానికి చెందిన పలువురు వ్యాపారులను కూడా ఈ మాయాజాలంలోకి లాగి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం పై దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు ఆధ్వర్యంలో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అటు పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కోట్లాది రూపాయల మోసం జరగడంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి ఆకర్షణీయమైన పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also read
- మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?
- Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్..!
- లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..
- ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..





