పార్వతీపురం మన్యం జిల్లాలో సంచలనం రేపిన బిడ్డిక ఉషారాణి(32) అనే గిరిజన యువతి హత్య కేసు మిస్టరీ వీడింది. కేవలం కేసు నమోదయిన రెండు రోజుల వ్యవధిలోనే కేసును చేదించారు పోలీసులు. యువతి హత్యకు సంబంధించి ఆమె ప్రియుడితో పాటు అతనికి సహకరించిన ఓ స్టాఫ్ నర్స్, మరో యువకుడుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటి అంటే ఉషారాణితో ప్రేమాయణం కొనసాగిస్తూనే మరోవైపు వివాహిత అయిన ఓ స్టాఫ్ నర్స్ తోనూ రిలేషన్‌షిప్ కొనసాగించాడు.. మన్యం జిల్లా పాలకొండ మండలం బర్న సీతంపేటకి చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి(32) హత్య కేసుకు సంబంధించి మృతురాలి ప్రియుడు M.సింగుపురానికి చెందిన రెడ్డి భువనేశ్వర్(25), అతని కజిన్ తేజేశ్వరరావు(23), వీరఘట్టం మండలం బొడ్లపాడుకు చెందిన స్టాఫ్ నర్స్ కృపారాణి(35)లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో M. సింగుపురానికి చెందిన భువనేశ్వర్, పక్క గ్రామమైన బర్న సీతంపేటకు చెందిన ఉషారాణి గ్రామ వాలంటీర్లుగా పనిచేసేవారు. ఆ సమయంలోనే ఉషారాణి, భువనేశ్వర్ ల మధ్య ప్రేమ చిగురించి అది శారీరక సంబంధాలు వరకు వెళ్లింది. అయితే ఓ పక్క ఉషారాణితో ప్రేమాయణం సాగిస్తూనే.. మరోవైపు M.సింగుపురం PHC లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న కృపారాణి కి ఇటీవల దగ్గరయ్యాడు భువనేశ్వర్. కృపారాణికి వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భువనేశ్వర్, కృపారాణి వ్యవహారం తెలిసి ప్రియుడు భువనేశ్వర్ ను నిలదీయడంతో పాటు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది గిరిజన యువతి అయిన ఉషారాణి. ఉషారాణి గిరిజన యువతి కాగా భువనేశ్వర్ బీసీ కులస్తుడు.. దీంతో ఉషారాణిని వివాహం చేసుకోవటం ఇష్టం లేని భువనేశ్వర్.. ఉషారాణి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు.
నిద్రమాత్రలు ఇచ్చి చంపేయాలని సలహా ఇచ్చి..
ఉషారాణిని చంపేయటానికి స్టాఫ్ నర్స్ కృపారణితో కలిసి పథకం వేసాడు భువనేశ్వర్. ఈ క్రమంలో స్లీపింగ్ పిల్స్ ఇస్తే ఈజీగా చనిపోతుందని సలహా ఇవ్వటంతో పాటు నిద్రమాత్రలను సమకూర్చి భువనేశ్వర్ కి ఇచ్చింది స్టాఫ్ నర్స్ కృపారాణి. ఈనెల 6న ఒరిస్సాలోని రాయిఘడ దైవదర్శనానికి వెళ్దామని చెప్పి అతని కజిన్ S.తెజేశ్వరరావుతో కలిసి కారులో ఉషారాణిని తీసుకువెళ్లాడు ప్రియుడు భువనేశ్వర్. అయితే ఇంట్లో వారికి అనుమానం రాకుండా ఓ ఉద్యోగానికి ఆన్ లైన్ దరఖాస్తు చేయడానికి మండల కేంద్రం అయిన పాలకొండ వెళ్ళి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుండి వెళ్ళింది ఉషారాణి.. ఆమె సోదరుడు బైక్ పై ఉషారాణి నీ పాలకొండ తీసుకువెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. కానీ బడ్డుమాసింగి జంక్షన్ రాగానే తాను అక్కడ బైక్ దిగిపోయింది. తన స్నేహితురాలు ఇక్కడికి వస్తాది.. ఆమెతో కలిసి పాలకొండ వెళ్తాను అని చెప్పి తన తమ్ముడును ఇంటికి పంపించి భువనేశ్వర్ కారు ఎక్కి రాయఘడ కు పయనం అయింది ఉషారాణి. అయితే ముందుగా వేసిన పథకం ప్రకారం కారులో వెళ్తూ మార్గమధ్యంలో పల్పీ ఆరంజ్ డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపి ఉషారాణికి ఇచ్చాడు భవనేశ్వర్. దీంతో డ్రింక్ తాగి మత్తులోకి వెళ్లిపోయింది ఉషారాణి. అయినా ప్రాణాలతోనే ఉండటంతో కృపారాణి కి ఫోన్ చేసి విషయం చెప్పాడు భువనేశ్వర్.
ముక్కు, నోరు మూసి దారుణంగా చంపేసి.. రాయి కట్టి చెరువులో పడేశారు
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తుడ్డలి వద్ద తాను ఉన్నానని కృపారాణి చెప్పడంతో కారుతో అక్కడికి వెళ్లి కృపారాణినీ పికప్ చేసుకున్నారు భువనేశ్వర్, తేజేశ్వరరావులు. అక్కడ నుండి కారులో ఉషారాణిని తీసుకొని కొల్లివలస వద్ద నిర్మాణస్యంగా ఉన్న ఓ వెంచర్ లోకి వెళ్లారు భువనేశ్వర్, తేజేశ్వరరావు, కృపారాణి. అక్కడ అప్పటికే మత్తులో ఉన్న ఉషారాణి నోరు, ముక్కు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసారు ముగ్గురు నిందితులు. ఉషారాణి మొబైల్ ఫోన్ ను, సిమ్ కార్డును అక్కడే పడేశారు. ఉషారాణిని చంపేసిన తర్వాత.. ఆమె మృతదేహాన్ని ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జనపడ్డారు నిందితులు. మొదట అదే రోజు రాత్రి ఆమదాలవలస వద్ద ఎండిపోయిన ఓ చెరువులో మృతదేహాన్ని పడేసి ముగ్గురు నిందితులు తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ ఇంటికి వెళ్ళాక ఆలోచించిన భువనేశ్వర్ ఉషారాణి మృతదేహం ఉదయాన్నే స్థానికుల కంట పడితే.. పోలీసులు విచారణలో తాము దొరికిపోతామని భావించాడు. తిరిగి అదే రాత్రి తేజేశ్వరరావుతో కలిసి కారులో ఉషారాణిని మృతదేహాన్ని పడేసిన చోటుకి వెళ్లి ఆమె బాడీని కలెక్ట్ చేసుకున్నారు.
కారులో మృతదేహంతో కలసి తిరిగి తమ స్వగ్రామం వైపు వస్తూ మార్గమధ్యంలో తాళ్ళతో కాళ్ళు, చేతులు కట్టేసి, ఆమె మృతదేహానికి సర్వే రాయి కట్టి 7వ తేదీ తెల్లవారుజామున తుమరాడ వద్ద చెరువులో నీళ్లలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. అయితే ఈనెల 10వ తేదీన ఉదయం తమ కుమార్తె కనిపించటం లేదనీ పాలకొండ పోలీసులకు ఉషారాణి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. అదే రోజు సాయంత్రం తుమరాడ వద్ద చెరువులో ఆమె మృతదేహం బయట పడింది. గిరిజన యువతి ఉషారాణి హత్య జిల్లాలో సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులతో పాటు గిరిజన సంఘాలు భగ్గుమన్నాయి. హత్యను ఖండిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. దోషులను వెంటనే పట్టుకొని కటినంగా శిక్షించాలని అంతా డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారితో చర్చలు జరిపి దోషులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు.
నిందితులను పట్టించిన నిందితుడు తేజేశ్వరావు పాన్ కార్డ్..
పోలీసులు ఉషారాణి హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు.ఉషారాణి మృతదేహం లభ్యం అయిన చెరువు వద్ద నిందితుల్లో ఒకరైన తెజేశ్వరావు కి చెందిన పాన్ కార్డ్ పోలీసులకు లభ్యం అయింది. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఉషారాణి, భువనేశ్వర్ ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేయగా ముగ్గురు నిందితుల బండారం బయట పడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు. కేసు నమోదు అయిన కేవలం రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకోవడంతో పాలకొండ DSP రాంబాబు, CI ప్రసాద్, SI లను జిల్లా SP మాధవ రెడ్డి అభినందించారు. అమ్మాయిలు ప్రేమ వ్యవహారంలో మోసపోవద్దని SP సూచించారు.
Also read
- అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
- అటు ఆమెతో.. ఇటు ఇమెతో.. కట్ చేస్తే, పల్పీ ఆరంజ్ ఇచ్చి కారులో తీసుకెళ్లారు.. భువనేశ్వర్, కృపారాణి మామూలోళ్లు కాదు..
- శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని
- రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం కాదు.. ఆశ్చర్యపరిచే అసలు కారణాలు ఇవే!
- మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర కారణాలు!





