SGSTV NEWS online
CrimeTelangana

దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..


జోగుళాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థి, ఓ మహిళా లెక్చరర్ హేళన చేయడం, చెంపపై కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మొదటి ర్యాంకర్‌తో పోలుస్తూ అవమానించడాన్ని తట్టుకోలేక, మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..


కొత్తపల్లికి చెందిన వ్యవసాయ దంపతులు తెలుగు బుచ్చన్న, రేణమ్మల రెండో కుమారుడు తరుణ్ గద్వాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. గత శనివారం కళాశాలలో ఒక మహిళా లెక్చరర్, మొదటి ర్యాంక్ 435 మార్కులు వచ్చిన మరో విద్యార్థితో పోలుస్తూ తరుణ్‌ను తరగతి గదిలో అందరి ముందూ హేళన చేసింది. ఇలా నిరుత్సాహపరచడం సరికాదని తరుణ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఆ లెక్చరర్ విచక్షణ కోల్పోయి నీవేమైనా మంత్రి కుమారుడివా అంటూ చెంపపై కొట్టింది.

నలుగురిలో జరిగిన ఈ పరాభవాన్ని తరుణ్ తట్టుకోలేకపోయాడు. రెండు రోజుల పాటు తీవ్ర భావోద్వేగానికి, ఒత్తిడికి లోనై సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఒక విద్యార్థిని అతిగా పొగిడి, మరో విద్యార్థిని నిరుత్సాహపరచడం సరైనది కాదు. లెక్చరర్‌గా ప్రోత్సహించకపోయినా పర్వాలేదు కానీ నిరుత్సాహపరచకండి. నా చావుకు కారణమైన ఆ లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

ఈ విషయమై కళాశాల ప్రిన్సిపల్ వీరన్న మాట్లాడుతూ, సోమవారం ఉదయం తరుణ్ తన వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పాడని, విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పడంతో పాటు సదరు లెక్చరర్‌ను మందలించామని తెలిపారు. అయితే, అంతలోనే తరుణ్ ఇలా బలవన్మరణానికి పాల్పడటం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

Also read

Related posts