తెలిసిన వాళ్లు.. పైగా బంధువులే కదా అని పలకరిస్తే మాట కలిపారు. ఆపదలో ఉన్నామని చెబితే అండగా నిలిచింది.. అవసరమున్న ప్రతిసారీ లక్షల మేర సాయం చేసింది. కానీ, తానిచ్చిన డబ్బు తిరిగి అడగడానికి వెళ్తే ఆమెకు ఊహించని షాక్ తగిలింది. అప్పటివరకు బంధువులుగా నటిస్తున్న వారి అసలు భాగోతం బయటపడింది. ఇంతకూ ఆమె ఎదుర్కొన్న సమస్య ఏంటి? వైజాగ్ టు విజయవాడ వరకు ఈ క్రైమ్ స్టోరీ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
తెలిసిన వారే కదా.. ఆపదలో ఉన్నారని ఆదుకున్న ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆమెకు తెలియకుండానే ఆమె వీడియోలు రికార్డ్ చేసిన దుండగులు.. తమకు న్యూడ్ కాల్స్ చేయకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ.. రివర్స్‌లో ఆమెనే బ్లాక్‌మేల్ చేయడం ప్రారంభించారు. బంధువులని నమ్మి డబ్బులు ఇస్తే ఇంత మోసం చేస్తారా అని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ నగరానికి చెందిన ఓ మహిళ టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ టైలరింగ్ ద్వారా వచ్చిన డబ్బును రొటేషన్ చేస్తూ ఆర్థికంగా ఎదుగుతోంది. అయితే ఈ విషయం ఆమె సమీప బంధువులైన చొక్కర అశోక్, వండ్రాసి శంకర్ అనే ఇద్దరు వ్యక్తులకు తెలిసింది. దీంతో తాము కష్టాల్లో ఉన్నామని.. కొంత నగదు సాయం చేయాలని.. తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమెను నమ్మబలికారు. వారి మాటలు నిజమేనని నమ్మిన ఆమె.. 2018లో వారికి రూ. 21 లక్షల నగదును అప్పుగా ఇచ్చింది.
రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి.. కానీ వాళ్లు తీసుకున్న డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేదు. దీంతో ఓ రోజు ఆమె డబ్బులు తిరిగి ఇవ్వాలని అశోక్, శంకర్‌లను అడిగింది. సరే విజయవాడకు వచ్చి డబ్బు తీసుకెళ్లమని సదరు మహిళకు చెప్పారు ఆ ఇద్దరు కేటుగాళ్లు. తీరా ఆమె అక్కడికి వెళ్లాక.. ఆమె వ్యక్తిగత వీడియోను ఆమెకే చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడిలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు.
అంతేకాకుండా, బాధితురాలి వాట్సాప్ నంబర్‌కు అసభ్యకర వీడియోలు పంపడంతో పాటు, వాట్సాప్ ద్వారా న్యూడ్ వీడియో కాల్ చేసి, బాధితురాలిని కూడా అలాంటి వీడియో కాల్ చేయాలని బలవంతపెట్టారు. ఒకవేళ అలా చేయకపోతే.. తన వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు ఏం చేయాలో తెలియక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా చెప్పి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. అశోక్, శంకర్రావులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పోలీసుల హెచ్చరిక: అప్రమత్తంగా ఉండాలి!
ఈ ఘటన నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎవరైనా వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు లేదా వీడియో కాల్స్ ఆధారంగా బ్లాక్‌మెయిల్ చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించడం, అసభ్యకర వీడియోలు పంపించడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలని.. అలా చేసిన వారు సైబర్ క్రైమ్ కేసులను ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. మహిళలు, యువతులు ఎవరినైనా నమ్మే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచించారు.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




