SGSTV NEWS online
Andhra PradeshCrime

కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి





తల్లిదండ్రుల ఆందోళన ఆస్పత్రిలో పిల్లల వార్డు వద్ద బైఠాయింపు

విచారణ చేస్తున్న సీఎస్ఆర్ఎంవో డాక్టర్ శ్రీహరి

మహారాణిపేట: చంద్రబాబు పాలనలో వైద్యం అందక చిన్నారుల  ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటీవల కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్లతో గిరిజన బాలికలు మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. తాజాగా కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి మరో గిరిజన పసికందు బలి అయ్యాడు. పిల్లల వార్డులో చికిత్స పొందుతూ ఐదు నెలల ధన్వీర్ బుధవారం ఉదయం 8 గంటలకు మృతి చెందాడు. కేజీహెచ్లో సరైన వైద్యం అందించలేదని ధన్వీర్ తండ్రి అఖిల్ ఆరోపించారు.

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ మరణించాడని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బిడ్డ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వంగర గ్రామానికి చెందిన ఎ. అఖిల్ దంపతులకు రెండో సంతానంలో బాబు జన్మించాడు. ఈ బాబు ఈ నెల 8న అనారోగ్యానికి గురయ్యాడు. గుమ్మలక్ష్మీపురం పీహెచ్సీలో వైద్యం అందించారు. అక్కడి వైద్యులు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.

బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు అదే రోజు కేజీహెచ్కు రిఫర్ చేశారు. ఇక్కడకు వచ్చాక ఏం వైద్యం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియలేదు. మంగళవారం రాత్రి పసికందు ఆరోగ్యంగా కనిపించాడని తండ్రి అఖిల్ అన్నారు. అర్ధరాత్రి తర్వాత పసికందు మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

ఈ విషయాన్ని వార్డులో ఉన్న వైద్యులకు, నర్సులకు సమాచారం ఇచ్చినా ఎవరూ వచ్చి చూడలేదని, మందులు కూడా ఇవ్వలేదని, అందువల్లే బిడ్డ మరణించినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ధన్వీర్ మృతితో తల్లిదండ్రులు, వారి బంధువులు కేజీహెచ్ పిల్లల వార్డు ఎదుట ఆందోళనకు దిగారు. తమ బాబుకు సరైన వైద్యం అందలేదని, నిర్లక్ష్యం చూపిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరొకరికి ఇలా జరగకూడదు: అఖిల్

కేజీహెచ్ మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. బాబుకు బాగోలేకపోతే ఆస్పత్రికి వచ్చామని, కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ మరణించినట్లు కేజీహెచ్ సీఎస్ ఆర్ఎంవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై సీఎస్ఆర్ఎంవో డాక్టర్ శ్రీహరి విచారణ చేస్తున్నారు.

Also read

Related posts