Kakinada News: సోషల్ మీడియాలో వచ్చే
రీల్స్ ని గుడ్డిగా నమ్మడం ఒక కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. కాకినాడ జిల్లా ఎర్రంపాలెం గ్రామంలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉమ్మెత్త పువ్వు కూర తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వచ్చే వీడియోలను చూసి, అవగాహన లేకుండా విషపూరితమైన మొక్కలను ఆహారంగా తీసుకోవడం ఈ ప్రమాదానికి దారితీసింది.
ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్న ఈ కుటుంబం, స్థానిక అమ్మవారి జాతర ఉత్సవాల కోసం తమ సొంత ఊరైన ఎర్రంపాలెంకు వచ్చారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే వంటకాల వీడియోలను చూస్తున్న వీరికి ఉమ్మెత్త పువ్వుకు సంబంధించిన ఒక వీడియో కనిపించింది. సాధారణ ఆకుకూరల మాదిరిగానే ఉమ్మెత్త పువ్వు కూర కూడా శరీరానికి ఎంతో బలమని ఆ వీడియోలో చెప్పడంతో వారు అది నిజమని నమ్మారు. వెంటనే ఉమ్మెత్త పువ్వులను సేకరించి పప్పుతో కలిపి కూర వండుకుని తిన్నారు.
ఆహారం తిన్న కొద్దిసేపటికే కుటుంబ సభ్యులైన గంగా భవాని, వీరలక్ష్మి, వీరబాబు, జయలక్ష్మి ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. పరిస్థితి గమనించిన స్థానికులు వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి నలుగురి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పెట్టే ఇలాంటి అశాస్త్రీయ వీడియోలు ఎంతటి ప్రమాదాలకు కారణమవుతున్నాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
ఉమ్మెత్త పువ్వులో అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పదార్థాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన విరుగుడు (Antidote) ఉండదని, శరీరంలో పాయిజన్ శాతం పెరిగితే ప్రాణాపాయం తప్పదని వారు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలను లేదా కొత్త రకం వంటకాలను ప్రయత్నించే ముందు వాటి గురించి పూర్తి స్థాయిలో ఆరా తీయాలని, లేదంటే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
Also read
- సోషల్ మీడియా రీల్స్ పిచ్చి.. ఉమ్మెత్త పువ్వు కూర వండుకుని తిన్న కుటుంబం.. పరిస్థితి విషమం
- యూట్యూబ్‌లో చూసి ప్లాన్.. భార్యకు పాలకోవా తినిపించి..
- ఆమె ఓ యాంకర్.. పగలంతా హోస్టింగ్.. రాత్రయితే..
- రాత్రి బాయ్‌ఫ్రెండ్.. ఉదయం గర్ల్‌ఫ్రెండ్ సూసైడ్.. ఒక్క ఫోన్‌కాల్ ఎంత పని చేసిందో..!
- పక్కోడి పెళ్లిలో ఇంకెన్నాళ్లు డ్యాన్స్ చేస్తారు?.. తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్లు





