July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

Road Accident : దర్శనానికి వెళుతూ ప్రమాదం.. ఇద్దరి మృతి.. 15 మందికి గాయాలు

నిజామాబాద్‌ రూరల్‌: మొక్కు చెల్లించుకునేందుకు దర్గా వద్దకు వెళ్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో 15 మంది గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన రెంజర్ల స్వామి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులతో కలిసి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ఐచర్‌ వ్యాన్‌లో వర్ని మండలంలోని బడాపహాడ్‌ దర్గాకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని మల్కాపూర్‌ గ్రామ శివారులో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రెంజర్ల వసంత(30), రెంజర్ల శ్యాంసుందర్‌(48) అక్కడికక్కడే మృతి చెందారు.

వ్యాన్‌లో ప్రయాణిస్తున్న మరో 15 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు మరో రెండు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎంపీ అరి్వంద్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా, ఎంపీ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్‌(బీఆర్‌ఎస్‌), జీవన్‌రెడ్డి(కాంగ్రెస్‌) బాధితులను శుక్రవారం పరామర్శించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో అతివేగంగా వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐచర్‌ వ్యాన్‌ డ్రైవర్‌ కృష్ణపై కేసు నమోదు చేశామని నిజామాబాద్‌ రూరల్‌ ఎస్‌హెచ్‌వో చైతన్యరెడ్డి తెలిపారు.

రెండిళ్లకు పెద్ద దిక్కు శ్యాంసుందర్‌
కమ్మర్‌పల్లి: వ్యాన్‌ బోల్తాపడిన ఘటనలో మృతి చెందిన రెంజర్ల శ్యాంసుందర్‌ రెండు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నాడు. మండల కేంద్రానికి చెందిన శ్యాంసుందర్‌ 19ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఏనుగు అంజయ్య కూతురు భారతిని వివాహం చేసుకొని ఇల్లరికం వెళ్లాడు. శ్యామ్‌సుందర్‌ తండ్రి రెంజర్ల చిన్న నర్సయ్య 12ఏళ్ల క్రితం, మామ అంజయ్య కొన్నేళ్ల క్రితం కొవిడ్‌తో మరణించారు. దీంతో అటు తన కుటుంబ బాధ్యతలతోపాటు ఇటు అత్తవారింటి బాధ్యతలను శ్యాంసుందర్‌ చూసుకుంటున్నాడు. పెద్దదిక్కైన శ్యాంసుందర్‌ మృతితో  రెండు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి

Also read

Related posts

Share via