SGSTV NEWS online
Andhra PradeshCrime

కంటిపాపలను చిదిమేసి.. తానూ వెళ్లిపోయింది




ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి.. మతిస్థిమితం లేని తల్లి ఆత్మహత్య  ఇబ్రహీంపట్నం, న్యూస్టుడే: మతిస్థిమితం సరిగా లేని ఓ తల్లి.. నవమాసాలు మోసి, కని పెంచిన బిడ్డలను తన చేతులతోనే కడతేర్చింది. తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండల పరిధి పైడూరుపాడులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామంలోని కొత్త కాలనీకి చెందిన కవిత (34)కు బంధువైన శ్యామ్తో 2015లో వివాహమైంది. వీరికి లాస్య (11), సాత్విక్ (9)లు సంతానం. పెళ్లయిన కొత్తలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం కవిత పలు ప్రయత్నాలు చేసింది. పిల్లలు ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరు, నాలుగో తరగతులు చదువుతున్నారు. శ్యామ్కు సొంతంగా లారీలు ఉన్నాయి. వీటి నిర్వహణతో పాటు సిమెంటు బ్రిక్స్ రవాణా చేస్తుండటంతో ఆయా పనుల్లో తనమునకలుగా ఉంటారు. కవిత 2020 నుంచి మానసిక సమస్యతో ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకుంటోంది. ముభావంగా ఉంటూ, ఎవరితోనూ కలిసేది కాదు. తరచూ తాను చనిపోతానని చెబుతూ ఉండేది. తాను చనిపోతే పిల్లలను పట్టించుకోరన్న ఆలోచనతో క్షణికావేశానికి లోనైంది. మధ్యాహ్నం మంచంపై నిద్రిస్తున్న కుమార్తె, కుమారుడి మెడలకు చున్నీ బిగించి ప్రాణాలు తీసింది. అనంతరం ఆమె అదే గదిలో ఫ్యానుకు ఉరేసుకుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. ఆమె భర్త, అత్త మధ్యాహ్నం ఊరికి వెళ్లి, తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో.. చుట్టుపక్కల వారి సాయంతో బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ముగ్గురూ విగతజీవులుగా పడి ఉన్నారు. సాత్విక్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Also read

Related posts