అక్క, అన్న హత్యలకు తమ్ముడి ప్రతీకారం
హైదరాబాద్; బాలాపూర్, : అక్క, అన్నను హతమార్చాడనే ప్రతీకారంతో బావను బావమరిది కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇన్స్టాలో లైవ్ పెట్టి హత్య పరిసరాలను చూపించాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారు మీర్పేటలో జరిగింది. మీర్పేట్ ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లికి చెందిన దాసరి సురేందర్ ఎలియాస్ సూరి(41) రౌడీషీటర్. ఇతడిపై 3 హత్య కేసులు, పోక్సో, దొంగతనాలు తదితర నేరాలపై 45 కేసులున్నాయి. గతేడాది ఏప్రిల్లో అప్పటి రాచకొండ సీపీ సుధీర్ బాబు.. సురేందర్ను నగరం నుంచి బహిష్కరించారు. దీంతో వరంగల్కు మకాం మార్చాడు. గతేడాది నవంబరులో అక్కడ ఓ హత్యకు పథకం వేసినట్టు గుర్తించిన పోలీసులు ముందుగానే అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి ఉప్పల్ చేరాడు. రెండో భార్య పూజతో కలిసి అక్కడే ఉంటున్నాడు.
సురేందర్ తొలుత సబా ఫాతిమా అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె తప్పు చేసిందనే అనుమానంతో 2022లో హత్య చేశాడు. దీంతో సురేందర్ను సబాఫాతిమా పెద్ద తమ్ముడు సల్మాన్(బావమరిది) బెదిరించాడు. అతడి వల్ల ఎప్పటికైనా ప్రమాదం ఉందని భావించి 2024లో సల్మాన్ను చంపేసి సురేందర్ జైలుకు వెళ్లాడు. ప్రస్తుతం ఉప్పల్లో ఉంటున్నాడు. ఫాతిమా చిన్నతమ్ముడు అర్ఫాజ్(24) నందనవనంలో ఉంటున్నాడు. అక్క, అన్నను హతమార్చిన సురేందర్ను చంపేందుకు అదను కోసం ఎదురుచూశాడు. తనపై అనుమానం రాకుండా సురేందర్తో స్నేహంగా ఉంటున్నట్టు నటించాడు. నందనవనం గణేశ నగర్లో సురేందర్ రెండో భార్య పూజ అన్న గోవిందు ఉంటున్నాడు. సోమవారం రాత్రి 11.50 గంటలకు గోవిందు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మరో ముగ్గురితో కలిసి అక్కడకు వచ్చిన అర్ఫాజ్ గోవిందుకు కేకు తినిపించాడు. ఏమరపాటుగా ఉన్న సురేందర్ ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లాడు. అతడు తేరుకునేలోగానే కత్తితో పొడిచాడు. పారిపోయేందుకు యత్నించినా అరకిలోమీటర్ వెంటపడి మరోసారి కత్తితో పొడిచి హతమార్చాడు.
హత్యానంతరం ఇన్స్టాలో లైవ్..
హత్యానంతరం.. అర్ఫాజ్ ఇన్స్టా లైవ్లో మిత్రులతో కైసా హై భాయ్.. ఎట్లుంది నా ఆట అంటూ నవ్వుతూ సురేందర్ను హత్య చేసిన విషయాన్ని పంచుకున్నాడు. సుమారు 4 నిమిషాల నిడివి వీడియో.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వేరే రాష్ట్రానికి పారిపోయేందుకు యత్నించిన అర్ఫాజ్తోపాటు మరో ముగ్గురిని మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అర్ఫాజ్తో వెళ్లిన ఇద్దరు యువకులకు హత్య పథకం గురించి తెలియదని పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది.
Also read
- వెంటాడి.. వేటాడి రౌడీషీటర్ హత్య
- ఠాణాలో భార్యపై కత్తితో దాడి
- తొలి ఏకాదశి.. విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సిన పరిహారాలు ఇవే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్‌కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!





