SGSTV NEWS online
CrimeTelangana

నల్లగా ఉన్నావు.. అదనపు కట్నం తీసుకురా..!




భార్యపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడుతున్న కెనడా పారిపోతుండగా అరెస్టు చేసిన ఖమ్మం పోలీసులు

ఖమ్మం : భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న ఓ ఎన్ఆన్ఐని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని సుధాచంద్రికకు ఏపీలోని ఒంగోలుకు చెందిన వెంకట నవీన్సాయి చందుతో 2022లో వివాహమైంది.

నవీన్సాయి కెనడా పౌరసత్వం కూడా కలిగి అక్కడే బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వివాహమైన తర్వాత భార్యను తనతోపాటు తీసుకెళ్లాడు. వీరికి 9 నెలల కుమార్తె ఉంది. అయితే నవీన్సాయి పెళ్లయిన నాటి నుంచి భార్యను నల్లగా ఉన్నావని, అదనపు కట్నం తేవాలని శారీరకంగా బాధించేవాడు. ఈ క్రమంలో సుధాచంద్రిక ఫిర్యాదు మేరకు కెనడా పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. అనంతరం బయటకు వచ్చిన నవీన్ సాయి గత జనవరిలో భార్య, కుమార్తెతో కలిసి ఇండియాకు వచ్చాడు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ నిర్వహించినా అతనిలో మార్పురాలేదు. చిన్నారి అన్నప్రాశన వేడుకకు ఒంగోలు వెళ్లిన క్రమంలో అత్తమామలపై దాడికి పాల్పడ్డాడు. మరదలి నిశ్చితార్థానికి ఖమ్మం వచ్చి భార్య, కుమార్తె పాస్పోర్టులు తీసుకెళ్లిపోయాడు. దీంతో గత నెలలో సుధాచంద్రిక ఖమ్మం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. తరువాత భార్య, కుమార్తెను విడిచిపెట్టి కెనడాకు పారిపోతున్నట్లు తెలుసుకున్న సుధాచంద్రిక మే 14న మళ్లీ ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి నిందితుడిపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఈ క్రమంలో 18న చెన్నై విమానాశ్రయంలో నవీన్సాయిని అదుపులోకి తీసుకున్నారు. 20న ఖమ్మం ప్రత్యేక మొబైల్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అతడి  పాస్ పోర్ట్ ను కోర్టు స్వాధీనం చేసుకుంది.

Also read

Related posts