ఐదుగురికి తీవ్రగాయాలు అడ్డుకోబోయిన సీఐపైనా దాడి ఫర్నిచర్ ధ్వంసం.. స్టేషన్ రక్తసిక్తం
కొల్లూరు, : మద్యం దుకాణం వద్ద జరిగిన ఓ
వివాదం తీవ్రరూపం దాల్చింది. ఇరువర్గాలు
తలపడటంతో బాపట్ల జిల్లా కొల్లూరు పోలీసు స్టేషన్ రణరంగంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ సహా ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడగా, స్టేషన్‌లోని కుర్చీలు, బల్లలు ధ్వంసమయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. స్థానిక వేమూరు రోడ్డులోని ఓ వైన్ షాప్ ఎదురుగా తోపుడు
బండిపై నూడిల్స్ వ్యాపారం చేసే ఉప్పు జానకీరామ్ శుక్రవారం రాత్రి దుకాణం మూసేసి, అక్కడే నిల్చున్నాడు. మద్యం మత్తులో ఉన్న కొండూరు సురేష్ అక్కడికి వచ్చి ‘మా నాయకుడు మధుసూదన్ ప్రసాద్ ను
తిడతావా’ అంటూ జానకీరామ్‌తో గొడవకు దిగాడు.తన చేతిలోని మద్యం సీసాతో జానకీరామ్ తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు వెంటనే కొల్లూరు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని బంధువులు బాలు, శివన్నారాయణ మరికొందరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రక్తమోడుతున్న మేనమామ జానకీరామ్‌ను చూసి బాలు ఆవేశానికి లోనయ్యాడు. దాడికి పాల్పడిన సురేష్ నివసించే ఎస్సీకాలనీకి వెళ్లి కత్తి చూపించి, ‘మీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించాడు.
తీవ్ర ఆగ్రహానికి లోనైన సురేష్ సుమారు 30 మంది అనుచరులతో కలసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో పోలీసుస్టేషన్‌కు వచ్చాడు. అక్కడ ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న సురేష్, అతని అనుచరులు దాడి చేయడంతో జానకీరామ్‌తో పాటు అతని అక్క, బావ, వారి కుమారుడు బాలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడితో పోలీసు స్టేషన్ ముందుగది రక్తసిక్తమైంది. స్టేషన్‌లోని కుర్చీలు, బల్లలు, కూలర్, పూలకుండీలను దుండగులు ధ్వంసం చేశారు. ఘటనను వీడియో తీసిన ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి ఫోన్ లాక్కొని, అతనిపైనా దాడికి యత్నించారు. స్టేషన్ పక్కనున్న వాహనాన్ని సురేష్ అనుచరులు తగలబెట్టేందుకు యత్నించారు. అడ్డుకున్న వాహన డ్రైవర్, హోంగార్డు నాగరాజును కొట్టారు. అక్కడే ఉన్న వేమూరు సీఐ వీరాంజనేయులుతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. అదనపు బలగాలు రప్పించడంతో సుమారు గంటన్నర తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. క్షతగాత్రులను 108లో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
Also read
- పోలీసు స్టేషన్ లో రెండు వర్గాల ఘర్షణ
- నల్లగా ఉన్నావు.. అదనపు కట్నం తీసుకురా..!
- Telangana : లవర్ చింటూ కోసం.. కట్టుకున్న భర్తను JCBతో లేపేసింది!
- మంటల్లో కాలి భర్త మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో భార్య..రెండు గంటల్లో రెండు ప్రాణాలు
- పోలీసులు వేధిస్తున్నారు.. సెల్ఫీ వీడియో తీసుకొని మహిళ ఆత్మహత్య





