July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం..పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం

అమరావతి
పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్  ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్  పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని… అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని స్పష్టం చేశారు. మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్ళేలా షెడ్యూల్ ఉండాలని పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు.  

పిఠాపురం వెళ్ళిన తొలి రోజు శక్తిపీఠమైన  పురూహూతిక అమ్మవారి దర్శనం చేసుకొంటారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. ఆ రోజు నుంచి మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీలక కార్యకర్తలతో మండలాలవారీగా సమావేశాలు ఉంటాయి. కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ నాయకులతో భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్  నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలోని బంగారు పాప, దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశములతో పాటు సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఉగాది వేడుకలను పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్  నిర్వహించుకోబోతున్నారు.





మీడియాకు సమాచారం:

అభ్యర్థుల ఎంపికలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే అంతిమం

• అతిక్రమించి మాట్లాడేవారిపై క్రమశిక్షణ చర్యలు

జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయమే అంతిమం. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ  ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయానికి వస్తారు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి. అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న తరవాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించడమవుతుంది. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యులతో చర్చించి, సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము.

(కె.నాగబాబు)
ప్రధాన కార్యదర్శి

(సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్)
జనసేన

Also read

Related posts

Share via