SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు


అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ యువతిని చంపి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు గుర్తు తెలియని దుండగులు. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాధితురాలి తల్లి వాపోయారు.

AP Crime: అనంతపురంలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియెట్ సెకెండియర్ చదువుతున్న ఓ యువతి చనిపోయిన శరీరం మణిపాల్ స్కూల్ వెనుక భాగంలో పూర్తిగా కాలిన స్థితిలో బయటపడింది. ఈ విషాద సంఘటనతో  పట్టణంలో ఒక్కసారిగా సంచలనం రేపింది. మంగళవారం నుంచి కనిపించకపోవడంతో విద్యార్థినీ తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసులు పెద్దగా స్పందించలేదని బాధితురాలి తల్లి వాపోయారు. తమ ఫిర్యాదును పట్టించుకుని తక్షణమే చర్యలు తీసుకుని ఉంటే.. తమ బిడ్డని తిరిగి చూడగలిగేదాన్ని అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

పెట్రోల్ పోసి నిప్పు పెట్టి..
విద్యార్థినీ కూల్‌డ్రింక్ తీసుకెళ్తానంటూ ఇంటి నుంచి బయలుదేరినట్లు సమాచారం. కానీ అప్పటి నుంచే ఆమె కనిపించలేదు. మృతదేహాన్ని చూసిన తల్లితండ్రులు కుమిలిపోతున్నారు. కడుపు కోతను తట్టుకోలేక విలపిస్తున్నారు.  తమ కుమార్తెను అలా చూస్తామనుకోలేదని వారు గుండెవిదిరిపోయే రీతిలో రోదిస్తున్నారు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన పద్ధతిని బట్టి ఇది పూర్తిగా ముందస్తుగా ప్రణాళిక వేసిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఘటన జరిగిన తర్వాతనే గానీ గట్టిగా స్పందించని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నెమ్మదిగా నడుస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారికంగా మృతురాలి వివరాలను ప్రకటించకపోయినప్పటికీ.. స్థానికంగా ఆమె గుర్తింపు లభించినట్లు తెలుస్తోంది. ఈ హత్య వెనుక ఉన్న కారణాలు, ఎవరు చేసినా, ఏ ఉద్దేశంతో చేసినా తీవ్ర విచారణకు గురిచేసి నిందితులను శిక్షించాలన్న డిమాండ్ చేస్తున్నారు. అనంతపురంలో ఇది మామూలు ఘటన కాదని, ఇది మహిళల భద్రతపై పెద్ద ప్రశ్న వేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనతో మరోసారి మహిళా భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this