SGSTV NEWS
Andhra Pradesh

Amaravati: ఛీ.. అమరావతి మహిళలను అంతమాట అన్నారేంటి? వైసీపీ సెల్ఫ్ గోల్


అధికారంలో ఉన్నప్పుడు హద్దుమీరి మాట్లాడినందుకే ఇప్పుడు చాలామంది దాని ఫలితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా వారి మాటతీరు మారలేదు. సరికదా మరింత రెచ్చగొట్టే ధోరణికి అలవాటు పడ్డారు. అమరావతి రాజధానిగా అంగీకరించడం అంగీకరించకపోవడం వైసీపీ ఇష్టం. ఏపీకీ మూడు రాజధానులు సరిపోతాయా..? 30 కావాలా అనేది ఆ పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాల్సిన వ్యవహారం. అయితే అమరావతిపై మాటతూలడం మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. అందులోనూ అమరావతిని దేవతల రాజధాని అని కూటమి ప్రభుత్వం చెబుతుంటే.. కాదు కాదు.. ఆ ప్రాంతంలో వేశ్యల జనాభా ఎక్కువగా ఉంది ఇదిగో సాక్ష్యం అంటూ ఓ వాదన తెరపైకి తెచ్చారు.

ఈ వ్యాఖ్యలు చేసింది వైసీపీ నేతలా కాదా అనే విషయం పక్కనపెడితే సాక్షి స్టూడియోలో పనిగట్టుకుని ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది. అంటే దీన్ని కచ్చితంగా వైసీపీ సపోర్ట్ చేసిందనే అనుకోవాలి. ఆ మాటలన్న కృష్ణంరాజు అనే జర్నలిస్ట్, ఆ డిస్కషన్ మొదలు పెట్టిన సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.

మహిళల ఆగ్రహం..పేపర్ సాక్షి కి వీర మహిళ వారిన్నింగ్



అమరావతి ప్రాంత మహిళలను నీచంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరులో రాజధాని మహిళలు నిరసనకు దిగారు. కృష్ణంరాజు, కొమ్మినేని చిత్రపటాలను చెప్పులతో కొట్టి తమ ఆగ్రహం వ్యక్తపరిచారు. అమరావతిని, మహిళలను దారుణంగా అవమానించిన ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వ్యవహారం అంతా జగన్ మెడకు చుట్టుకుంది. సాక్షిలో ప్రసారమైన ఆ కార్యక్రమం పర్యవసానాలు జగన్ కి చేటు తెచ్చేలా ఉన్నాయి. ఏదో పోలిక చెప్పబోయి, ఇంకేదో విమర్శ చేసి చివరకు సాక్షిని ఇరికించేశారు జర్నలిస్ట్ కృష్ణంరాజు.

లోకేష్ ఘాటు ట్వీట్..

సాక్షి టీవీలో జరిగిన డిబేట్ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అని ఆయన అన్నారు. “మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్లో పడుతుంది.” అంటూ జగన్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు లోకేష్.

అమరావతిపై సెల్ఫ్ గోల్..

అమరావతి విషయంలో జగన్ పదే పదే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూనే ఉన్నారు. మూడు రాజధానులతో తన పాలనా ప్రతిభ బయటపడుతుందని అనుకున్నారు కానీ.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. అమరావతి రైతుల ఆగ్రహ జ్వాలను తట్టుకోలేకపోయారు. చివరకు కోర్టు కూడా చీవాట్లు పెట్టడం, ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చినా జగన్ మాత్రం మారలేదు. ఇప్పటికి కూడా ఆయన అమరావతి మన రాజధాని అని చెప్పలేకపోతున్నారు. ఈ దశలో ఆయన సాక్షి టీవీలో అమరావతిపై విషం చిమ్మేలా వచ్చిన కార్యక్రమం వైసీపీని మరింత అభాసుపాలు చేసింది. ఆ పార్టీకి అమరావతిపై ఉన్న కక్షని మరోసారి బట్టబయలు చేసింది. అంతేకాదు, అమరావతిని వారు ఎంత నీఛంగా చూస్తున్నారో కళ్లకు కట్టింది. అమరావతి ప్రాంతంలో జగన్ కూడా ఇల్లు కట్టుకుని ఉంటున్నారు కదా..! మరి సదరు జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలు జగన్ ఇంటికి కూడా వర్తిస్తాయా అంటూ నెటిజన్లు లాజిక్ తీస్తున్నారు. కనీసం ఈ ప్రశ్నను కూడా వైసీపీ ఫేస్ చేయలేకపోతోంది.





చేతులు కాలాక ఆ ఇద్దరూ ఆకులు పట్టుకున్నారు. కృష్ణంరాజు తన వ్యాఖ్యలకు దురుద్దేశాలు ఆపాదించొద్దని చెప్పారు. దేశంలో సెక్స్ వర్కర్స్ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నివేదిక వచ్చిందని.. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందనే తాను హైలైట్ చేశానని అన్నారు. ఇక కొమ్మినేని కూడా ఈ వ్యవహారంలో సారీ చెప్పి సరిపెట్టారు.





మొత్తమ్మీద సాక్షి టీవీ మరోసారి జగన్ ని ఇరికించేసింది. ఎన్నికల ఫలితాల సమయంలో సాక్షి ఛానెల్ లో జరిగిన చర్చలు ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా నవ్వులు పూయిస్తుంటాయి. ఇప్పుడు తాజాగా జరిగిన మరో చర్చ ఆగ్రహ జ్వాలలకు ఆజ్యం పోసింది. దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.



Also read

Related posts

Share this