November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

Tirumala Laddu: ఏపీ సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ.. బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్

శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదన్నారు.

జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానన్న బండి సంజయ్, లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించడం నీచం అన్నారు. గత పాలకులు టీటీడీని పట్టించుకోలేదు. అన్యమతస్తులకు TTD పగ్గాలు ఇవ్వడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే ఇలాంటివి జరగవని, హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామన్నారు.

లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి, టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారని మండిపడ్డారు. క్షమించరాని నేరానికి ఒడిగట్టారన్నారు. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, అన్యమతస్తులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించడంవల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందన్న బండి సంజయ్, ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

దేవుడిపై నమ్మకం లేని నాస్తికులకు, అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడంవల్లే తిరుమల కొండపై అన్యమత ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతోందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని బండి సంజయ్ కోరారు.

Also read

Related posts

Share via