July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ముస్లిం మహిళపై వైకాపా నాయకుడి అసభ్య ప్రవర్తన

నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఓ ముస్లిం మహిళపై వైకాపా నాయకుడు, పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ప్రశ్నించడానికి వెళ్తే చెప్పుతో దాడి శాప్ ఛైర్మన్ అనుచరుడి అరాచకం కర్నూలులో ఆందోళన.. ఉద్రిక్తత

నందికొట్కూరు, : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఓ ముస్లిం మహిళపై వైకాపా నాయకుడు, పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం బడే రాత్ సందర్భంగా నమాజ్కు వెళ్తున్న ఓ ముస్లిం మహిళ వద్దకు శ్రీనివాసరెడ్డి వెళ్లి బురఖా తొలగించి చూశాడు. దీంతో ఆమె వెంటనే ఇంటికి తిరిగి వెళ్లి భర్తకు, కుమారుడికి ఈ విషయాన్ని తెలిపారు. శ్రీనివాసరెడ్డి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ముఖ్య అనుచరుడు. బాధితురాలి భర్త, కుమారుడు స్థానికులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లి ప్రశ్నించడంతో కోపోద్రిక్తులైన శ్రీనివాసరెడ్డి దంపతులు ‘మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తారా’ అంటూ వారిని చెప్పుతో కొట్టారు. ఈ విషయం బంధువులకు, మిత్రులకు చెప్పడంతో వారంతా కలిసి రాత్రి శ్రీనివాస రెడ్డి ఇంటి పైకి వెళ్లి గొడవకు దిగారు. అక్కడ ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సుమారు 300 మందికి పైగా ఉండటంతో పోలీసులు వారిని అదుపు చేయడం కష్టమైంది. వెంటనే వారు వైకాపా నాయకుడిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు అక్కడకు చేరుకొని రహదారిపై బైఠాయించారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేసి ఎఫ్ఎఆర్ పత్రాన్ని వారికి చూపించడంతో ధర్నా విరమించి వెనుదిరిగారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య, నాయకుడు లింగారెడ్డి బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. వైకాపా ప్రభుత్వంలో మైనారిటీలపై ఇలాంటి దాడులు మామూలైపోయాయని ఆరోపించారు. ముస్లింలకు తెదేపా అండగా ఉంటుందన్నారు.

Also read

Related posts

Share via