SGSTV NEWS
Andhra PradeshCrime

ఇన్స్పెక్షన్‌కు వచ్చిన బ్యాంక్‌ ఆఫీసర్‌ను ఇంట్లో బంధించి, బట్టలు తీయించి..

గుంటూరుకు చెందిన విజయసారధి బాపట్ల జిల్లా చీరాల ఎస్‌బిఐ బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. బ్యాంకులో గతంలో లోన్‌ తీసుకున్న హేమలత అనే మహిళ తిరిగి చెల్లించిన అనంతరం తనకు ఇంటి కోసం రుణం కావాలని దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో హేమలతకు రుణం మంజూరు చేసేందుకు ఇంటి నిర్మాణం జరిగే చీరాల గంజిపాలెం ప్రాంతానికి వెళ్ళి వాకబు చేసేందుకు బ్యాంక్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ విజయసారధి నిర్ణయించుకున్నారు. బ్యాంకులో పనిచేస్తున్న మెసెంజర్‌ తెనాలి నెహ్రూ ద్వారా ఆమె ఇంటి అడ్రస్‌ తెలుసుకున్నారు. ఈనెల 7వ తేదిన ఇన్‌స్పెక్షన్‌ కోసం బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ విజయసారధిని హేమలత తన ఇంటికి పిలిపించుకున్నారు.


అయితే అక్కడ హేమలత లేకపోగా ఓ మహిళ ఉన్నారు. హేమలత ఇప్పుడే వస్తుంది ఇంట్లో కూర్చోమని ఆ మహిళ చెప్పి బయటకు వెళ్ళిపోయింది. అనంతరం నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు విజయసారధి దగ్గరకు వచ్చి ఇంటి తలుపులు మూసేశారు. విజయసారధిని బెదిరించి ఒంటిపై బట్టలు తీయించి వీడియోలు తీశారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. హేమలతపై లైంగిక దాడికి ప్రయత్నించినట్టు ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేశారు. దీంతో భయంతో వణికిపోయిన బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ విజయసారధి ఫోన్ నుంచి రూ.72 వేలు వారి ఖాతాకు మళ్లించుకున్నారు. మరో 10 లక్షలు ఇవ్వకుంటే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కేసుపెడతామని బెదిరించి పంపేశారు.

సహ ఉద్యోగి ప్రమేయంపై అనుమానాలు..
హేమలత ఇంటి నుంచి బయటపడిన బ్యాంకు అధికారి విజయసారథి జరిగిన విషయాన్ని బ్యాంకులో పనిచేస్తున్న మెసెంజర్‌ తెనాలి నెహ్రూకు తెలిపి ఆవేదన చెందారు. తాను వారితో మాట్లాడి ఫొటోలు, వీడియో డిలీట్ చేయిస్తానని నమ్మబలికి అందరికీ కలిపి 6.50 లక్షలు ఇవ్వాలని నెహ్రూ ప్రతిపాదన పెట్టాడు. దీంతో సారథి ఈ నెల 8న అడిగిన మొత్తాన్ని నెహ్రూకు ఇచ్చాడు. అయితే సమస్యను పరిష్కరించినందుకంటూ నెహ్రూ మరో 75 వేలు విజయసారధి నుంచి తీసుకున్నాడు. ఇంత జరిగినా ఆశ చావని హేమలత, ఆమె అనుచరులు మరో 5 లక్షలు కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో తనను పూర్తిగా వాడుకుంటున్నారని తెలుసుకున్న ఫీల్డ్ ఆఫీసర్ ఈ నెల 21న చీరాల వన్‌ టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసి 5.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళ పరారీలో ఉంది. ఈ ఘటన ఇటు బ్యాంకు అధికారులతో పాటు చీరాల పట్టణ వాసులను విస్మయానికి గురి చేసింది

Also read

Related posts

Share this