సినిమా స్టైల్లో ప్లాన్ చేశాడు.. చేతికి మట్టి అంటకుండా భార్యను వదిలించుకోవాలనుకున్నాడు…దొరక్కుండా ఉండేందుకు ఒంటిపై బ్లేడు గాట్లు పెట్టుకుని, పోలీసుల ముందే కన్నీరుమున్నీరయ్యాడు. కానీ, సీన్ కట్ చేస్తే.. ఒకే ఒక్క కూరగాయల సంచి అతడిని పట్టించింది. భార్యను తానే సుపారీ గ్యాంగ్‌తో చంపించి, దొంగ ఏడుపులు ఏడ్చిన ఓ కిల్లర్ భర్త గుట్టును ఐడీఏ బొల్లారం పోలీసులు రట్టు చేశారు.
బిహార్‌కు చెందిన అనిల్‌కుమార్, మీనాదేవి (35) దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి ఐడీఏ బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నారు. అనిల్ లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ, వాహనాలను రెంట్ కు ఇస్తుంటాడు. అయితే, గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. ఇంట్లో రోజు గొడవలే. ఈ క్రమంలోనే భార్యను వదిలించుకోవాలని అనిల్ ఒక క్రూరమైన స్కెచ్ వేశాడు. బిహార్‌కు చెందిన నలుగురు నిందితులకు సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశాడు.
మే 30వ తేదీ సాయంత్రం.. ప్లాన్ ప్రకారం భార్య మీనాదేవిని తీసుకుని అనిల్ బైక్‌పై సంతకు వెళ్లాడు. కూరగాయలు కొనుక్కొని తిరిగి వస్తుండగా, ఓ నిర్మానుష్య ప్రాంతంలో కావాలనే బైక్ ఆపాడు. రిపేరు చేస్తున్నట్లు నాటకమాడాడు. సరిగ్గా అదే సమయంలో పొదల్లో నక్కిన ముగ్గురు సుపారీ కిల్లర్స్ ఒక్కసారిగా దాడి చేసి, మీనాదేవిని లాసుకెళ్లారు. అనిల్ కళ్లముందే ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అనిల్ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి.. నన్ను కొట్టి, నా కళ్లముందే నా భార్యను గుర్తుతెలియని దుండగులు చంపేశారు అంటూ ఒంటిపై గాయాలు చూపిస్తూ నమ్మించే ప్రయత్నం చేశాడు.
బ్లేడుతో కోసుకున్నట్టు గాయాలు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఘటనా స్థలంలో కొన్ని విషయాలు విచిత్రంగా అనిపించాయి. ముఖ్యంగా.. అనిల్ ప్రవర్తన తేడాగా ఉంది. అతడి చేతులు, వీపు మీద ఉన్న కత్తి గాట్లు ఎవరో దాడి చేసినట్టు లేవు.. సినిమాలో లాగా కావాలని బ్లేడుతో కోసుకున్నట్టు ఉన్నాయి.అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. కూరగాయల సంచి… అవును.. దుండగులు అకస్మాత్తుగా వచ్చి లాక్కెళ్తుంటే ఏ మహిళ అయినా భయంతో చేతిలో ఉన్న వస్తువులు విసిరేస్తుంది. కేకలు వేస్తుంది. కానీ, అక్కడ కూరగాయల సంచి కింద పడలేదు, అందులోని కూరగాయలు అస్సలు చెల్లాచెదురు కాలేదు. ఎవరో పద్ధతిగా పక్కన పెట్టినట్టు ఆ సంచి ఒక మూలన భద్రంగా ఉంది. ఈ చిన్న అనుమానమే పోలీసులకు పెద్ద క్లూగా మారింది.
పోలీసులు తమదైన శైలిలో అనిల్‌ను విచారించడంతో అసలు నిజం బయటపడింది. భార్యపై కక్షతో తానే బిహార్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి చంపించినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు భర్త అనిల్‌తో పాటు, సుపారీ గ్యాంగ్‌లోని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు హంతకుల కోసం వేట కొనసాగిస్తున్నారు.
Also read
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!
- దాగుడు మూతలు ఆడుతూ ఆ ఇంటి పక్కన నిలబడ్డారు.. ఇంతలోనే అకస్మాత్తుగా..
- పోలీస్ అని నమ్మి కారు ఇచ్చాడు.. 3 నెలల తర్వాత బయటపడిన అసలు కథ!





