హైదరాబాద్: నిత్యం తల్లిదండ్రుల మధ్య
గొడవలు జరుగుతున్నాయి.. వారి కూతుళ్లు విసిగి వేసారిపోయారు.. సొంతూరికి వెళ్లి ఏదైనా పని చేసుకుని బతుకుదామని భావించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైల్ ఎక్కారు . పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఆదివారం గాంధీనగర్ ఏసీపీ కార్యాలయంలో సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ యాదగిరి, దోమలగూడ సీఐ అంజద్ అలీతో కలిసి వివరాలు వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ కు చెందిన తోటరాం, రాంధులారి దంపతులు 2 నెలల క్రితం నగరానికి వలస వచ్చి దోమలగూడ ఫరీద్ బస్తీలో నివసిస్తున్నారు. హిమాయత్నగర్ ని ఓ హోటల్లో పనిచేస్తున్నారు. ఆ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటంతో భరించలేక వారి కుమార్తెలు సహిత కుమారి(17), స్నేహ కుమారి(16)తోపాటు సమీప బంధువైన లత(15) గత ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఇంట్లోంచి పారిపోయారు. పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాదాపు 262 సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు.
రైలెక్కి.. ఛత్తీస్గఢ్ చేరి..
హిమాయత్నగర్ మెయిన్ రోడ్లో ఆటో ఎక్కిన బాలికలు కాచిగూడ రైల్వేస్టేషన్కు, అక్కడ నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఘన్పూర్ ఎక్స్ప్రెస్లో నాగ్పూర్ చేరుకోగా ఓ వ్యక్తి చేరదీసి ఫాంహౌస్లో పనులు చేసేందుకు గడ్చిరోలి మీదుగా ఛత్తీస్గఢ్లోని పతంజూరుకు చెందిన బిశ్వజిత్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు గుర్తించిన బిశ్వజిత్ దోమలగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఛత్తీస్గఢ్లోని కాంకర్ పోలీసుల సహకారంతో బాలికలను తీసుకొచ్చి సఖీ సెంటర్కు అప్పగించారు. తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో పిల్లల్ని పెంచాలని డీసీపీ సూచించారు.
Also read
- అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
- బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?
- షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..!
- ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
- నిడదవోలు నియోజకవర్గం – పట్టణ వివిధ వార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం





