SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణహత్య

జూబ్లీహిల్స్ లో నగలు, నగదు కోసం నేపాలీ గ్యాంగ్ ఘాతుకం

ఇంట్లో పనిమనిషి సహకారంతో దోపిడీ

బంజారాహిల్స్ (హైదరాబాద్): బంగారు నగలు, నగదు కోసం
నేపాలీ గ్యాంగ్ ఘాతుకానికి పాల్పడింది. హైదరాబాద్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే…జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రశాసన్ నగర్ రోడ్ నం.7లో ప్లాట్ నం. 46లో జైళ్లశాఖలో అదనపు డీజీగా పనిచేసి రిటైర్ అయిన వినయ్ రంజన్రాయ్ కుటుంబం ఉంటోంది. ఈ నెల 1వ తేదీన వినయ్ రంజన్రాయ్ చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లారు. ఇంట్లో ఆయన భార్య తనూజ రంజన్ (60) మొదటి అంతస్తులో ఉండగా, రెండో అంతస్తులో ఆమె ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల క్రితం ఈ ఇంట్లో పనిమనిషిగా నేపాల్కు చెందిన కల్పన చేరింది. నమ్మకంగా పనిచేస్తున్నట్టు నటిస్తూ తనూజ ఆలనాపాలనా చూసేది.

తండ్రి బెంగళూరుకు వెళ్లడంతో మొదటి అంతస్తులో తల్లి ఒక్కరే ఉంటారని, బెడ్రూమ్ ముందు హాల్లో పడుకోవాలని పెద్దకూతురు సునంద గురువారం రాత్రి 9 గంటలకు కల్పనకు చెప్పి పైఅంతస్తుకు వెళ్లింది. అంతకుముందే పథకం వేసుకున్న కల్పన రాత్రి 1 గంట సమయంలో ఇంటి బయటకు వచ్చింది. అప్పటికే ఇంటి పక్కన మున్సిపల్ పార్కులో వేచి చూస్తున్న ముగ్గురు నేపాలీలను ఇంట్లోకి తీసుకెళ్లింది. ఆమె బయట కాపలా ఉండగా, ఆ ముగ్గురూ మొదటి అంతస్తులోకి వెళ్లి నిద్రిస్తున్న తనూజను లేపి కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె ఒంటిమీద ఉన్న నగలతోపాటు అల్మారాలో ఉన్న నగదు, రూ. కోట్ల విలువ చేసేబంగారు వజ్రాభరణాలను మూటగట్టుకొని 3.30 గంటల ప్రాంతంలో నలుగురు కలిసి ఉడాయించారు.



శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పెద్ద కూతురు సునంద బయట కార్పెంటర్ వెయిట్ చేస్తుండగా ఇంట్లోకి పిలిచి మొదటి అంతస్తులోకి తీసుకెళ్లింది. ఆమె వెళ్లేసరికి తల్లి బెడ్రూమ్లో నేల మీద కాళ్లు చేతులు కట్టేసి ఉండటంతోపాటు నోట్లో గుడ్డలు కుక్కి ఉండి అచేతనంగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే తన సోదరి, డ్రైవర్ సహాయంతో అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ విభాగ ఐజీ, సీసీఎస్ డీసీపీ తదితరులు అంతా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. జరిగిన ఘటనపై సునంద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో తనూజ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. ఆమె ఒంటిమీద ఎలాంటి గాయాలు లేకపోవడం చూస్తే ఆమెపై దాడి జరగలేదని కేవలం నోట్లో గుడ్డలు కుక్కడం వల్ల ఊపిరాడక చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తమ బెడ్రూమ్లోని అలమారాలో భారీగా నగదు, నగలు ఉన్నాయని అవి ఎంత అనే విషయం తెలియదని మృతురాలి భర్త వినయ్ రంజన్రాయ్ పోలీసులకు ఫోన్ లో చెప్పారు.

సీసీ ఫుటేజీలో నలుగురు

నేపాలీ గ్యాంగ్ ఇంట్లోకి వస్తున్న, బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పని మనిషి బయటికి వచ్చి వారిని పిలవగా చేతుల్లో కత్తులు, రాడ్లతో ముగ్గురు ఆగంతకులు లోపలికి రావడం కనిపించింది. సరిగ్గా 3.30 గంటల ప్రాంతంలో వీరంతా బంగారు, నగదు ఉన్న బ్యాగుతో ఉడాయించారు. అంతకుముందు రోజు రాత్రి కూడా ఇక్కడ ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గడిచిన నెల రోజుల నుంచి వీరు ఈ ఇంట్లో దొంగతనానికి పథకం వేసినట్లు తెలుస్తున్నది. కల్పన పనిలో చేరేముందు ఎలాంటి ఆధారాలు యజమానులకు ఇవ్వలేదు. వీరి కోసం ముమ్మర గాలింపు జరుగుతోంది. వీరు నేపాల్లోకి ప్రవేశించకముందే పట్టుకోవాలని వేర్వేరు చోట్ల బృందాలు నిఘా పెట్టాయి.

Also read

Related posts