వివాహేతర సంబంధానికి అడ్డిస్తున్నాడని మహిళ ఘాతుకం ఏడాదిన్నర తర్వాత మృతదేహం వెలికితీత నిజం నిగ్గుతేలిన వేళ తల్లి అనుమానాస్పద మృతి
కర్నూలు, ఆదోని మంత్రాలయం : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నిలువెత్తు కుమారుడిని ప్రియుడితో కలిసి చంపేసిన ఓ తల్లి.. ఆ వాస్తవం బయటపడిన సమయానికి పోలీసుల విచారణ క్రమంలో అనుమానాస్పదంగా మృతిచెందింది. కని పెంచిన చేతులతోనే బిడ్డ ప్రాణాలు తీసింది కాక, మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించడం లేదంటూ ఆమె హైకోర్టు మెట్లెక్కడం ఈ కేసులో విస్మయం కలిగించే అంశం. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాలు గ్రామానికి చెందిన చిన్నమల్లయ్య, గంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్నమల్లయ్య కొన్నాళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో చనిపోయారు. ఆమెకు ఆదోని మండలం జి.హొసళ్లి గ్రామానికి చెందిన బంధువు దర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దర్గప్ప తరచూ తమ ఇంటికి రావడం నచ్చని గంగమ్మ పెద్దకుమారుడు వీరేశ్(17).. అతనితో పలుమార్లు గొడవపడ్డాడు. వీరేశ్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న గంగమ్మ, దర్గప్ప.. 2024 నవంబరులో ఇంట్లోనే అతన్ని కత్తితో పొడిచి చంపేశారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టేసి, బైక్‌పై తీసుకెళ్లి సమీప శ్మశానవాటికలో పాతిపెట్టారు. తన కుమారుడు వీరేశ్ కనిపించడం లేదని 2024 నవంబరు 11న గంగమ్మ కౌతాళం ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును తేల్చలేకపోయారు.
డబ్బులకు కక్కుర్తి పడి..
హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని కొందరు సలహా ఇవ్వడంతో ఆశపడిన గంగమ్మ.. తన కుమారుడి ఆచూకీ తెలియడం లేదని, పోలీసులు సరిగ్గా వెతకడం లేదని ఇటీవల పిటిషన్ వేశారు. దీన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి, వీరేశ్ అదృశ్యంపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. స్పందించిన డీజీపీ.. ఈ కేసు దర్యాప్తునకు గుంటూరు సీసీఎస్ అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీ రవికుమార్ తదితరులతో సిట్ వేశారు. రెండు వారాలుగా సిట్ సభ్యులు ఆరాతీయగా, గంగమ్మ కిరాతకం బయటపడింది. వీరేశ్‌ను గంగమ్మ, దర్గప్పలు కలిసి చంపేసినట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులు ఆదివారం జి.హొసళ్లికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. అస్థిపంజరం వద్ద దొరికిన తాడు, టవల్, దుప్పటి చూసి మృతుడి కుటుంబసభ్యులు అవి వీరేశ్వని గుర్తించారు. అస్థిపంజరం నుంచి నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గంగమ్మది లాకప్ డెత్
ఇంతలో ఆదివారం గంగమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనమైంది. ‘అనారోగ్యంతో రెండు రోజుల కిందట గంగమ్మ ఆదోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం శనివారం కర్నూలులోని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించార’ని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య బదినేహాలుకు తీసుకొచ్చి హడావుడిగా అంత్యక్రియలు జరిపించారు. సిట్ అధికారులకు ‘ఈనాడు’ ప్రతినిధులు ఫోన్ చేయగా స్పందించలేదు. గంగమ్మది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. వీరేశ్ హత్యకేసులో దర్గప్పను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
Also read
- గోదావరి నదిలో స్నానానికి వెళ్లి బావబావమరిది మృతి
- ఒకే రోజు గంటల వ్యవధిలో శవాలుగా మరిన వృద్ధ దంపతులు.. మిన్నంటిన రోధనలు
- జీడిమామిడి తోటలో ఏం జరిగింది..? శవాలుగా తల్లీకూతురు.. ఉలిక్కిపడ్డ ఏలూరు..
- పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి….. గ్రీష్మ కుమార్,సి.పి.ఐ.యం.యల్. (న్యూ డెమోక్రసీ)
- శివుని అష్టమూర్తి తత్వం అంటే ఏంటి? పరమేశ్వరుడు ఎక్కడెక్కడ వెలిశాడు?





