మంగుళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిపై ఓ వ్యక్తి మారణాయుధంతో దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, బంట్వాల్‌లోని కేఎస్ఆర్టీసీ న్యూ బస్ స్టాండ్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతురాలిని లావణ్యగా గుర్తించారు. ఆమె కక్కేపదవు ప్రాంతానికి చెందిన యువతిగా,కళ్లడ్కలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. లావణ్య బస్సు కోసం వేచి ఉండగా నిందితుడు ఆమె వద్దకు వచ్చాడు. అనంతరం తన బ్యాగులో నుంచి పదునైన ఆయుధాన్ని తీసి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించినా, నిందితుడు వెంటాడి దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్ర గాయాలతో ఉన్న లావణ్యను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఈ ఘటనలో నిందితుడిగా చేతన్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు మృతురాలికి దూరపు బంధువని, కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లావణ్య తన ప్రేమను తిరస్కరించడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు.
ఈ దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. బంట్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక, బస్టాండ్ వంటి బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ హత్య స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, నగరంలో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
Also read
- కొనసాగుతున్న దళితులపై దాడుల పరంపర….ఐ.యఫ్.టి.యు
- బస్టాండ్ లో దారుణం.. ప్రేమ నిరాకరించిందని బంధువు దాడి!
- కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?
- Hyderabad: ఓల్డ్‌సిటీ ప్రైవేట్ స్కూల్లో కలకలం.. కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్ వర్క్..
- బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం! ప్రేమ పేరుతో ఒకడు, వీడియోలు ఉన్నాయంటూ ఇద్దరు..





