కేటుగాళ్ల చేతిలో వంచనకు గురవుతున్న సామాన్యులు తెలంగాణవ్యాప్తంగా వెలుగులోకి ఈ తరహా మోసాలు
హైదరాబాద్, అతడి పేరు బాలాజీ, వయసు 27. డిగ్రీ ఫెయిలైన అతడు 2019లో స్థిరాస్తి వ్యాపారంలోకి దిగాడు. ఖరీదైన కార్లలో తిరుగుతూ దర్జా ప్రదర్శిస్తూ తనకు పెట్టుబడి రూపంలో డబ్బులిస్తే నెలకు 6 శాతం వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికాడు. తొలినాళ్లలో ఠంచనుగా వడ్డీ ఇస్తుండటంతో అనతికాలంలోనే వందలమంది అతడి బుట్టలో పడ్డారు. అలా బాలాజీ సుమారు రూ.50 కోట్ల వరకు వసూలు చేసి చివరకు చేతులెత్తేశాడు. బాధితుల ఫిర్యాదుతో నల్గొండ పోలీసులు బాలాజీని అరెస్ట్ చేశారు.
ఎక్కడికక్కడే ఈ తరహా మోసాలు
ఇలాంటి మోసాలు ఒక్క నల్గొండ జిల్లాకే పరిమితం కాలేదు. అదికవడ్డీ ఆశచూపి మోసాలకు పాల్పడుతున్న ముఠాల ఉదంతాలు తెలంగాణాలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడికక్కడే ఏజెంట్లను నియమించుకోవడం ద్వారా వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలు తొలినాళ్లలో వడ్డీని సక్రమంగా ఇస్తూ నమ్మకం చూరగొంటున్నాయి. పెద్దమొత్తంలో డబ్బు సమకూరిన తర్వాత రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేస్తున్నాయి. పలువురు ఎలాంటి అనుమతుల్లేకుండా ఇలా అధికవడ్డీల పేరిట రూ.కోట్లు వసూలు చేస్తున్నా.. అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలాజీ చేతిలో మోసపోయిన బాధితుల్లో అత్యధికులు గిరిజన సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం.
కరీంనగర్ లో సామాన్యులే లక్ష్యంగా వల
ఉత్తరాదికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ కరీంనగర్ జిల్లా కేంద్రంలో తమ కార్యాలయాన్ని తెరిచింది. 70 నెలలపాటు వాయిదాలు కడితే అదనంగా దాదాపు 50శాతం చెల్లిస్తామని చెప్పింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని వసూళ్లకు పాల్పడింది. ఈ క్రమంలో చిరు వ్యాపారు లతో సహా పలువురు రూ. కోట్ల మేర డిపాజిట్లు కట్టారు. కొంత కాలంగా కార్యాలయం తెరవక పోవడంతో మోస పోయినట్లు గ్రహించిన బాధితులు., రెండు రోజుల క్రితం కరీంనగర్లో సమావేశమై ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకున్నారు.
రూ.5 లక్షలు కడితే స్థలంతో పాటు వడ్డీ
‘మీరు రూ.5 లక్షలు కడితే 102 చదరపు గజాల స్థలాన్ని మీ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తాం. అంతేకాదు 42 నెలలపాటు నెలకు రూ.25 వేల చొప్పున చెల్లిస్తాం’ అంటూ ఊదరగొట్టాడు మధు అనే మోసగాడు. అతడి మాయమాటలను నమ్మి బాదితులు రూ.కోట్లలో చెల్లించి మోసపోయారు. కొన్నిరోజుల తర్వాత నెలవారీ డబ్బుల కోసం బాధితులు అడిగితే మధు బెదిరింపులకు దిగాడు. ఓ బాధితుడిచ్చిన పిర్యాదుతో సైబరాబాద్ ఆర్థికనేరాల విభాగం పోలీసులు మధును రెండురోజుల క్రితం అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో సీఐడీకి చిక్కులు
ఆదికవడ్డీ ఆశచూపి వసూళ్లకు పాల్పడినట్లు నమోదైన కేసుల దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం 5 ఎఫ్ఐఆర్లను సీఐడీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుల విషయంలో సాక్ష్యాధారాల సేకరణ కష్టంగా మారడంతో బాధితులు మోసపోయింది ఎంత? అని తేల్చడం సీఐడీకి సవాల్ గా మారింది.
Also read
- రెండు రోజుల్లో కుమార్తె వివాహం…
- అత్యాశకు పోయి.. అధిక వడ్డీ వలకు చిక్కి..
- వ్యాపారిని చంపిన కానిస్టేబుల్ దంపతులు
- కోనసీమలో పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ – 39 మందికి అస్వస్థత
- రేణుకను పక్కా ప్లాన్‌తోనే చంపేశారా..? క్రోసూరు పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏం జరిగింది.. ఏపీలో సంచలనం




