ఏలూరు:’నేను ఓ పత్రికకు సీఈవోను. మాది సంపన్న కుటుంబం. తల్లిదండ్రులు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. సోదరి ఆస్ట్రేలియాలో ఉంది’ అని మాయమాటలు చెప్పి, మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వారి వద్ద నగలు, నగదు కాజేసిన ఓ నిత్య పెళ్లికొడుకు ఉదంతమిది. ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరులోని పాండురంగానగర్కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావుకు భార్య, పిల్లలున్నారు. గతంలో ఇతడు ఓ పత్రికలో పని చేశాడు. విలాసాలకు అలవాటు పడి, పెళ్లి చేసుకుంటానని మహిళలను మోసం చేస్తుండేవాడు. ఈ విషయం తెలిసిన పత్రికా యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించి, కేసులు పెట్టింది.
అయినా నిందితుడు అదే సంస్థకు సీఈవోనని చెప్పుకొంటూ భర్త చనిపోయిన, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో తన వివరాలు పోస్టు చేసేవాడు. ఖరీదైన వస్త్రాలు, కార్లు, బంగారు ఆభరణాలు, బంగ్లా ఉండేలా పోస్టులు పెట్టేవాడు. ఇవన్నీ చూసి నిజమేనని నమ్మిన మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. అలా పలువురి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నగదు, బంగారు నగలు కాజేశాడు. అనంతరం వారి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేవాడు. బ్యాగులో ఎప్పుడూ పెళ్లి వస్త్రాలు, బాసికాలు సిద్ధంగా ఉంచుకునేవాడు. ఇలా తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, విశాఖపట్నం జిల్లా పరవాడ, తెలంగాణలోని కోదాడ తదితర ప్రాంతాల్లో మహిళలను మోసగించాడు. కొందరిని వివాహాలు చేసుకుని వదిలేశాడు. 2020 నుంచి ఇప్పటి వరకు 40 మందిని పైగా మోసం చేశాడు.
డొంక లాగితే..
ఇటీవల ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోని ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని పరిచయం పెంచుకున్నాడు. అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి 10 కాసుల బంగారు నగలు, రూ.లక్ష తీసుకుని ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన ఆమె.. ముదినేపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ ్కుమార్ సారథ్యంలో సీఐ రవికుమార్ సాంకేతికత ఆధారంగా నిందితుడిని కనిపెట్టి అరెస్టు చేశారు. 8 కాసుల బంగారు నగలు, 6 ఫోన్లు, 10 సిమ్ లు , 9 ఏటీఎం కార్డులు, రోల్డ్ గోల్డ్ కడియాలు, ఉంగరాలు, చైన్లు, పెళ్లి బాసికలు, 3 జతల దుస్తులు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.
Also read
- నిడదవోలు. మత్తు… మహా విపత్తు!
- మళ్లీ ఆడబిడ్డ పుడుతోందని…మనస్తాపంతో ఆరునెలల గర్భిణి ఆత్మహత్య
- నేనో సీఈవోని.. మాది రిచ్ ఫ్యామిలీ!
- వేధింపులపై ప్రశ్నించాడని గొంతుకోశారు..
- హారతి సమయంలో గంట మోగించని ఏకైక ప్రసిద్ధ దేవాలయం ఇదే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!





