SGSTV NEWS online
CrimeTelangana

ఘనంగా నిశ్చితార్థం.. నాలుగు రోజుల్లో పెళ్లి.. కానీ, ఇంతలోనే..




మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాలి.. పచ్చని పందిరి కింద కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన యువకుడు.. విధి ఆడిన వింత నాటకంలో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో పెళ్లింట పెను విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో ఆ తల్లికి గుండెకోత మిగిలింది. జంగారాయి గ్రామానికి చెందిన పడాల లక్ష్మి ఏకైక కుమారుడు ప్రశాంత్ (30).. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన కొడుకును.. తల్లి కూలీనాలి చేసి డిగ్రీ వరకు చదివించింది. డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తల్లికి ఆసరాగా నిలుస్తున్న ప్రశాంత్‌కు.. ఈ నెల 23 న దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.

నిజానికి ఈ నెల 10వ తేదీనే పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాలతో 23వ తేదీకి వాయిదా పడింది. అదే ప్రశాంత్ ప్రాణాల మీదకు తెస్తుందని ఎవరూ ఊహించలేదు. పెళ్లి పనుల నిమిత్తం ఆదివారం సాయంత్రం స్కూటీపై మెదక్ వెళ్తుండగా..అంబాజీపేట శివారులో ఒక్కసారిగా కుక్క అడ్డురావడంతో ప్రమాదం సంభవించింది. కుక్కను తప్పించబోయి అదుపుతప్పి కిందపడటంతో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మెదక్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆసుపత్రిలోనే కన్నుమూశాడు.

పెళ్లికొడుకుగా చూడాలనుకున్న కొడుకు శవమై పడి ఉండటంతో తల్లి లక్ష్మి రోదనలు మిన్నంటాయి. మరో వైపు జంగరాయి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.. ఇక అప్పటిదాకా పెళ్లి పనులతో సందడిగా ఉన్న ఆ ఇల్లు.. ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

Also read

Related posts