Crime News:చాట్రాయి, మరిపెడ ప్రాంతాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు కుటుంబాలను శోకసంద్రంలో ముంచేశాయి. ప్రేమ పేరుతో ప్రారంభమైన బంధాలు చివరకు ఇద్దరు యువతుల ప్రాణాలను బలిగొనడం కలచివేస్తోంది. అత్తింటి వేధింపులు, ప్రేమికుడి మోసం కారణంగా ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటనలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి.
ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెంకు చెందిన కందుకూరి రవి 108 వాహన చోదకుడిగా పనిచేస్తున్నారు. ఆయన పెద్ద కుమార్తె మోహన చంద్రలేఖ(22) విస్సన్నపేటలో డిగ్రీ చదువుతోంది. ఈ సమయంలో ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన ఆరెళ్ల లితిన్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అభ్యంతరాలను లెక్కచేయకుండా గత నెల 23న ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తమకు పెద్దల నుంచి ముప్పు ఉందంటూ ముసునూరు పోలీసులను కూడా ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడగా, తాను మేజర్ని అని, లితిన్‌తోనే ఉంటానని చంద్రలేఖ స్పష్టం చేసింది.
అయితే పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె జీవితం నరకంగా మారింది. కట్నం తీసుకురాలేదంటూ అత్తింటి వారు, బంధువులు మాటలతో వేధించడం ప్రారంభించారు. “వట్టి చేతులతో వచ్చావు” అంటూ అవమానించేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని భర్తకు చెప్పినా ఎలాంటి మార్పు రాలేదని సమాచారం. వేధింపులు క్రమంగా పెరిగి చేయిచేసుకునే స్థాయికి చేరడంతో చంద్రలేఖ తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరకు తనను తీసుకెళ్లకపోతే చనిపోతానంటూ తండ్రికి ఫోన్ చేసి వేడుకుంది.
దీంతో ఆదివారం రాత్రి ఆమె పుట్టింటికి చేరుకుంది. సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అత్తింటి వారి వేధింపులపై ఎస్సైకి ఫిర్యాదు చేసింది. మంగళవారం రెండు కుటుంబాలతో మాట్లాడి పరిష్కారం చూపుతామని పోలీసులు హామీ ఇచ్చారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత “నేనే తప్పు చేశాను.. మీ అందరినీ నలుగురిలో నవ్వులపాలు చేశాను” అంటూ తల్లిదండ్రుల ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమైన సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే సమయంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఎల్లంపేట శివారు లక్ష్మాతండాకు చెందిన మాలోతు రమ్య(19) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎదగాలని ఆశపడేది. ఇంటర్మీడియట్ చదివే సమయంలో బోట్యాతండాకు చెందిన ధరంసోత్ సుమన్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ పెళ్లి విషయానికి వస్తే యువకుడు తప్పించుకుంటూ వచ్చాడని సమాచారం.
ఈ నెల 22న మరిపెడ బంగ్లా బస్టాండ్ వద్ద ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో “నిన్ను పెళ్లి చేసుకోను.. వేరే అమ్మాయిని చేసుకుంటాను” అని సుమన్ చెప్పినట్లు రమ్య తన మరణ వాంగ్మూలంలో వెల్లడించింది. ప్రేమించిన వ్యక్తి అవమానకరంగా మాట్లాడడంతో తీవ్ర మనోవేదనకు గురైన రమ్య ఇంటికి వెళ్లి ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.
మరణానికి ముందు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన మృతికి కారణమైన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రమ్య కోరినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ పేరుతో మొదలైన బంధాలు బాధ్యత లేకపోతే ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ రెండు ఘటనలు మరోసారి గుర్తుచేశాయి. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతుండగా, స్థానికంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
Also read
- Crime News:ప్రేమ పెళ్లి నెలకే విషాదం.. అత్తింటి వేధింపులతో యువతి ఆత్మహత్య
- గోదావరి నదిలో స్నానానికి వెళ్లి బావబావమరిది మృతి
- ఒకే రోజు గంటల వ్యవధిలో శవాలుగా మరిన వృద్ధ దంపతులు.. మిన్నంటిన రోధనలు
- జీడిమామిడి తోటలో ఏం జరిగింది..? శవాలుగా తల్లీకూతురు.. ఉలిక్కిపడ్డ ఏలూరు..
- పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి….. గ్రీష్మ కుమార్,సి.పి.ఐ.యం.యల్. (న్యూ డెమోక్రసీ)





