విజయవాడ నగరంలో గురువారం (మే 21) రాత్రి సినిమా యాక్షన్ సీన్లను తలపించేలా ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం కాస్తా, నడిరోడ్డుపై థార్ జీపులతో బాహాబాహీకి దిగేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పటమట హైటెన్షన్ 100 అడుగుల రోడ్డులో ఈ హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… లింగమనేని రోహిత్, బొల్లా ఓం అనే ఇద్దరు యువకులు ఒకే యువతి విషయంలో తీవ్ర ఘర్షణకు దిగారు. వీరి గొడవ కేవలం మాటలతో ముగిసిపోలేదు. ఇద్దరూ తమ థార్ జీపులతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ రోడ్డుపై అరాచకం సృష్టించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ వీధిపోరాటంలో జనం హడలిపోయారు. వాహనాలతో బీభత్సం సృష్టించడంతోపాటు రాడ్లు, బేస్‌బాల్ స్టిక్స్‌తో పరస్పరం దాడులు చేసుకున్నారు. సినిమా స్టంట్లను మించిపోయిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు.
సమాచారం అందుకున్న పటమట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, పోలీసులు వచ్చేసరికి లింగమనేని రోహిత్ అక్కడి నుండి పరారయ్యాడు. మరో యువకుడు బొల్లా ఓంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘర్షణ జరిగిన సమయంలో సదరు యువతి కూడా అక్కడే, కారులోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నగర నడిబొడ్డున పబ్లిక్ రోడ్డుపై ఇంతటి అరాచకానికి పాల్పడిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న రోహిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- Weekly Horoscope: ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!
- యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..





