చోరీలు చేసే దొంగలు.. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు.. కొందరు ఇళ్లను టార్గెట్ చేస్తారు.. మరికొందరు ఏటీఎంలను గుల్ల చేసేస్తారు.. ఇంకొందరు చైన్ స్నాచర్లు ఉంటారు.. మరికొందరైతే ఏకంగా ఆలయాలను టార్గెట్ చేసి దేవుడికి శఠ గోపం పెట్టేస్తారు. అటువంటి వారిలో ఒకడు ఆకోజు బ్రహ్మాజీ. వీడు కాస్త మిగతా దొంగలు కంటే డిఫరెంట్…
అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఆకోజు బ్రహ్మాజీ.. వ్యసనాలకు అలవాటు పడడంతో భార్య పిల్లలు దూరంగా పెట్టారు. దీంతో బ్రహ్మాజీ.. విశాఖ అల్లిపురానికి మకాం మార్చేశాడు. అక్కడ సింహాల దేవుడు వీధిలో ఓ ఇంట్లో నివాసం. కష్టపడి పనిచేయడనికి ఒళ్ళు వంచలేక.. ఈజీ మనీకి అలవాటు పడి.. దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అదే కూడా ఆలయాలను టార్గెట్ చేశాడు. భక్తుడులా అందరిలో కలిసిపోయి.. ఆ ఆలయాలపై రెక్కీ చేస్తాడు బ్రహ్మాజీ. అక్కడి అర్చకుడి వివరాలు తెలుసుకొని వారితో మాటలు కలుపుతాడు. భక్తుడి మాదిరిగా మాట్లాడుతూ.. మెల్లగా కూపీ లాగి ఆ ఆలయాన్ని గుల్ల చేసేస్తాడు.
అలా చేసి.. ప్లాన్..!
ఇక.. ఆలయంలో చోరీకి విచిత్ర వేషధారణ వేశాడు ఈ బ్రహ్మాజీ. చోరీల కోసం వేచి చూస్తున్న బ్రహ్మాజీకి విశాఖ వన్ టౌన్ వుడ్ యాడ్ స్ట్రీట్‌లోని దుర్గాలమ్మ ఆలయం ఎదుట ఒక బోర్డు కనిపించింది. అప్పటికే ఆలయంలో ఉన్న అర్చకుడికి వయసు మీద పడటంతో.. మరో అర్చకుడుని నియమించేందుకు నిర్వాహకులు నిర్ణయంచారు. దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి పూజారి కావాలని నిర్వాహకులు బోర్డు పెట్టారు. అది బ్రహ్మాజీ కంట్లో పడింది.. దీంతో ఇక భలే ఛాన్స్‌లే అనుకున్న బ్రహ్మాజీ.. నిర్వాహకులను సంప్రదించాడు. మే 19న అక్కడకు వెళ్లి తాను బ్రాహ్మణుడేనని.. తనకు ఉద్యోగం అవసరమని అభ్యర్థించడంతో.. బ్రహ్మాజీని పూజారిగా నియమించారు. ఆలయానికి సంబంధించిన తాళాలు అప్పగించారు.
పూజ కోసం పూలు తెమ్మని..!
ఇక.. అదే రోజు ఆలయంలో లోపలికి వెళ్లిన బ్రహ్మాజీ పూజ కోసం పూలు, పళ్ళు తెమ్మని కోరాడు. దీంతో నిర్వాహకులు బయటకు వెళ్లడంతో.. ఇక తన చేతికి పని చెప్పాడు. అప్పటికే తెచ్చుకున్న సంచిలో.. అమ్మవారి వెండి కిరీటం, హస్తం, చెవి ఆభరణాలతో పాటు వెండి వస్తువులు పట్టుకొని ఉడాయించాడు. దీంతో నిర్వాహకులు విషయాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కోసం గాలించారు. ఎట్టకేలకు వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న బ్రహ్మాజీని కురుపాం మార్కెట్ వద్ద పట్టుకున్నామన్నారు క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు.
వామ్మో.. వాడి నేరాల చిట్టా..
అయితే.. అతన్ని పట్టుకొని తమదైన స్టైల్ లో విచారించిన పోలీసులకు.. స్టన్ అయ్యే విషయాలు తెలిశాయి. చోరీల చిట్టా పోలీసుల ముందు విప్పాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఆలయాల్లో ఇప్పటివరకు చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్నట్టు గుర్తించారు. విశాఖ వన్ టౌన్ లో 3 నేరాలతో పాటు మల్కాపురంలో రెండు, భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మరో రెండు కేసులు, పెందుర్తి, కంచరపాలెం, చోడవరంలో ఒక్కో ఆలయంలో చోరీలు చేసినట్టు ఒప్పుకున్నాడు బ్రహ్మాజీ. బ్రహ్మాజీని అరెస్టు చేసిన పోలీసులు.. 2900 గ్రాముల వెండి, 7.6 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు.
కొన్ని ఆలయాల్లో భక్తుడిగా వెళ్లి రెక్కీ చేసి గుల్ల చేస్తే.. మరో చోట ఏకంగా పూజారిగా చేరి ఆలయంలో చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆకోజు బ్రహ్మాజీపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు