July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. వీళ్లే టాప్, లాస్ట్‎లో ఎవరంటే..

ఏపీలో ఎన్నికల హడావుడి జోరుగా కొనసాగుతోంది. రోజురోజుకీ నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. అన్ని పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తుండగా.. ఆస్తులు- అప్పుల వివరాలు బయటకొస్తున్నాయి. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లతో ఆస్తుల్లో టాప్‌ ఎవరు? లాస్ట్‌ ఎవరు? ఏపీలో ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఆస్తుల వివరాలను తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఏపీలో నమోదైన నామినేషన్లలో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా చూపారు. అందులో ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరిట రూ.639.26 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్లు తెలిపారు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని చెప్పారు.


నామినేషన్ సందర్భంగా ఆస్తుల చిట్టా ప్రకటించారు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక. అఫిడవిట్ ప్రకారం రూ.161.21 కోట్ల ఆస్తులతో బుట్టా రేణుక అత్యధిక ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే.. రూ.7.82కోట్ల అప్పులు ఉన్నాయి. అటు.. చరాస్తులు రూ.142.46 కోట్లు.. స్థిరాస్తులు రూ.18.75 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు బుట్టా రేణుక. ఇక.. అత్యధిక ఆస్తులు ఉన్న వారి జాబితాలో మూడో స్థానంలోనూ వైసీపీ అభ్యర్థే ఉన్నారు. శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆస్తుల విలువ పదేళ్లలో భారీగా పెరిగింది. ఆయన, ఆయన సతీమణి, కుమారుడి పేరిట రూ.131.71 కోట్లు ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.28.24 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. అయితే.. శిల్పా చక్రపాణిరెడ్డి ఆస్తులు.. 2014లో రూ.49.89 కోట్లుగా ఉండగా.. 2019లో రూ.37.27 కోట్లకు పడిపోయాయి. కానీ.. ఈ ఐదేళ్లలో ఆస్తులు దాదాపు వంద కోట్లు పెరగడం హాట్‌టాపిక్‌గా మారుతోంది.

మరోవైపు.. నందమూరి బాలకృష్ణ ఆస్తులు- అప్పుల వివరాలు కూడా కూడా బయటకొచ్చాయి. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన.. తన నామినేషన్ పత్రాల్లో ఆస్తులు- అప్పుల వివరాల్ని బాలకృష్ణ వెల్లడించారు. బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు కాగా.. రూ.9 కోట్ల అప్పు ఉన్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. బాలకృష్ణ భార్య వసుంధర ఆస్తుల విలువ అక్షరాలా రూ.140 కోట్లు కాగా.. రూ.3 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. మొత్తంగా.. ప్రస్తుత నామినేషన్ల ప్రకారం ఆస్తుల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టాప్‌లో ఉండగా… ఆ తర్వాత వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా, శిల్పా చక్రపాణిరెడ్డి, నందమూరి బాలకృష్ణ ఉన్నారు. భవిష్యత్తులో ఆయా స్థానాలను ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.

Also read

Related posts

Share via