SGSTV NEWS online
Andhra PradeshCrime

బస్సులో సీట్ల మధ్య నలిగిపోయిన చిన్నారులు..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్



గంటపాటు అన్నాచెల్లెళ్ల నరకయాతన



గోకవరం, : ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టిప్పర్ బలంగా ఢీకొన్న ప్రమాదంలో రెండు సీట్ల మధ్య ఆన్నాచెల్లెళ్లు ఇరుక్కుపోయి సుమారు గంటకు పైగా నరకయాతన అనుభవించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సింగారమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.


బస్సు సింగారమ్మ ఆలయం వద్ద ప్రయాణికులు దిగేందుకు ఆగింది. తర్వాత ముందుకు కదులుతుండగా వెనుక నుంచి దూసుకు వచ్చిన టిప్పర్ ఢీకొట్టి సుమారు 40 అడుగుల మేర నెట్టుకుంటూ వెళ్లిపోయింది. బస్సు వెనుక భాగం లోపలికి చొచ్చుకుపోవడంతో ఆఖరు సీట్ల వరుస ముందు సీటుకు నొక్కుకుపోయింది. దీంతో విశాఖపట్నానికి చెందిన అన్నాచెల్లెళ్లు వాసుదేవ ప్రబల్రామన్ (14), అన్నీ (9) రెండు సీట్ల మధ్య ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేశారు. ముందు సీటు కాళ్లను నొక్కేయడంతో ఆన్షీ కాలు, చెయ్యి, రామన్ రెండు కాళ్లూ విరిగిపోయాయి. వారు తమ తల్లి నాగలక్ష్మితో కలసి వీర్లంకపల్లిలో అమ్మమ్మ ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

అటవీ ప్రాంతం కావడంతో వారిని బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కట్టర్ను తీసుకొచ్చినప్పటికీ సమీపంలో విద్యుత్తు లేకపోవడంతో బస్సును సమీప ఆలయం వద్దకు తీసుకొచ్చి, అక్కడ విద్యుత్తును ఉపయోగించి సీటు కమ్మీలను ఒక్కొక్కటిగా కోసి తొలగించారు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న జేసీబీ సహాయంతో బస్సు వెనుక భాగంలో రేకులను లాగి చిన్నారులను బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్లో గోకవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరితోపాటు మరో ఇద్దరికి చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులున్నారు. గోకవరం ఎస్సై పవన కుమార్ కేసు నమోదు చేశారు..



Also read

Related posts