తణుకు, యలమంచిలి: అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది.
తణుకుకు చెందిన నంబూరు శ్రీనివాస్, పద్మిని దంపతులు స్థానికంగా కిరాణా, పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వ్యాపారం అంతంతమాత్రంగానే సాగుతుండటం, అప్పుల ఒత్తిడి పెరగడంతో.. కుమారుడు (16), కుమార్తె (12)తో కలిసి దంపతులు శనివారం తెల్లవారుజామున చించినాడ బ్రిడ్జి పైనుంచి నదిలోకి దూకారు. ఈ ఘటనలో పద్మినిని జాలర్లు రక్షించగా.. శ్రీనివాస్ తోపాటు ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. అపస్మారక స్థితిలోకి చేరిన పద్మినిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శ్రీనివాస్ సొంతూరు భీమవరంలోని మత్స్యపురి కాగా.. 20 ఏళ్ల క్రితం తణుకు వచ్చి స్థిరపడ్డారని స్థానికులు తెలిపారు. కుమారుడు పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం, కుమార్తె స్థానిక ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే తణుకు మండలం వేల్పూరుకు చెందిన దంపతులు అదే ప్రాంతంలో గోదావరిలోకి దూకిన ఘటనలో భర్త మృతి చెందగా, భార్య ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. పది రోజుల వ్యవధిలో మరో కుటుంబం అదే ప్రాంతంలో నదిలోకి దూకడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Also read
- అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు
- ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
- అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం
- సోషల్ మీడియా లో పరిచయం.. మాయమాటలతో వల
- చున్నీతో చేతులు కట్టేసి.. నోట్లో రుమాలు కుక్కి..





